హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టకు కెప్టెన్‌గా వ్యవహరించిన వార్నర్.. 2016లో జట్టును టోర్నమెంట్ విజేతగా కూడా నిలిపాడు. ఇక కరోనా లాక్‌డౌన్ సమయంలో తన కుటుంబసభ్యులతో కలిసి సరదాగా రీల్స్ చేసి.. ముఖ్యంగా పుష్ఫ సినిమా నుంచి రీల్స్ చేసి అభిమానులకు మరింత దగ్గరయ్యాడు వార్నర్. అయితే ఇప్పుడు వార్నర్ వెండితెర మీద సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న ‘రాబిన్‌హుడ్’ సినిమాలో వార్నర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ ఈవెంట్‌లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ వార్నర్‌ని ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వార్నర్‌ని రేయ్ అని సంబోధించడమే కాక.. అతన్ని బూతు మాటలు కూడా తిట్టారు. దీంతో వార్నర్ ఫ్యాన్స్ రాజేంద్ర ప్రసాద్‌పై ఫైర్ అవుతున్నారు. సీనియర్ నటుడు అయ్యుండి తెలుగు అర్థం కానీ ఓ విదేశీయుడిపై, అందులోనూ ప్రపంచ ప్రఖ్యాతి ఉన్న క్రికెటర్‌పై ఇలాంటి నీచమైన కామెంట్స్ చేయడాన్ని వాళ్లు విమర్శిస్తున్నారు. ఇంకొందరైతే.. రాజేంద్ర ప్రసాద్, వార్నర్‌కు సారీ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.