అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతం సవాంగ్‌ను బదలీ చేస్తూ ఆయన స్థానంలో కొత్త డిజిపిగా ఇంటెలిజెన్స్ డిజిగా పనిచేస్తున్న కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలో డిజిపి గౌతం సవాంగ్‌కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జిఎడిలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 1992 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన రాజేంద్రనాథ్‌రెడ్డి గతంలో విజయవాడ సిపిగా, విశాఖ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహించాడు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ వెస్ట్‌జోన్ ఐజిగా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిజిగా పనిచేశారు. కాగా రాష్ట్రల విభజన అనంతరం ఎపి క్యాడర్‌లోకి వెళ్లిన రాజేంద్రనాథ్ పలు కీలక కేసుల్లో ముఖ్య భూమిక పోషించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు.
గతంలో పనిచేసిన ప్రాంతాలు
ఎపి కొత్త డిజిపి కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డిది కడప జిల్లా రాజుపాలెం మండలంలోని పర్లపాడు గ్రామం. 1992 బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి 1994లో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్లో ఎఎస్‌పిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. 1996లో ఎఎస్‌పి హోదాలో వరంగల్ జిల్లా జనగాం, వరంగల్‌లలో విధులు చేపట్టారు. అలాగే 1996 నుంచి -97 వరకు కరీంనగర్‌లో ఆపరేషన్స్ ఎఎస్‌పిగా విధులు నిర్వర్తించారు. ఈక్రమంలో 1997 నుంచి -1999లో విశాఖ రూరల్ ఎస్‌పి, సిఐడి ఎస్‌పి, గుంతకలు,విజయవాడ రైల్వే ఎస్‌పిగా పని చేశారు. అక్కడ నుంచి నెల్లూరు ఎస్‌పి, హైదరాబాద్ నగరంలోని ఈస్ట్ జోన్ డిసిపిగానూ విధులు నిర్వర్తించారు.
2006- నుంచి 2008 వరకు ఎక్సైజ్ శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్, 2008 నుంచి 20-10 వరకు విజయవాడ సిపి, 2010- నుంచి 11 వరకు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిఐజి, ఐజిగా విధులు చేపట్టారు. అనంతరం 2011 నుంచి 20-13 వరకు నార్త్ కోస్టల్ ఐజీగా, 2013- నుంచి 2014 వరకు హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజిగా, 2015-నుంచి 2017 వరకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండిగా పని చేశారు.అలాగే 2018 నుంచి 20-19 వరకు డ్రగ్ కంట్రోల్ డీజీగా బాధ్యతలు చేపట్టారు. 2019-నుంచి 2020 వరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిజిగా, 2020 నుంచి ఇంటెలిజెన్స్ డిజిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఎపి ప్రభుత్వం ఆయనకు డిజిపిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.