న్యూఢిల్లీ : ఇండియా అహెడ్ న్యూస్ ఛానల్ ఉన్నతాధికారిని సిబిఐ సోమవారం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంబంధిత విషయంలో అరెస్టు చేసింది. ఈ విషయాన్ని అధికారులు ఇక్కడ వెల్లడించారు. లిక్కర్ స్కామ్ ముడుపుల డబ్బులను హవాలా లావాదేవీల ద్వారా గోవాలో ఆప్ ఎన్నికల ప్రచారానికి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఛానల్‌లో వాణిజ్య విభాగం సారధిగా, ప్రొడక్షన్ కంట్రోలర్‌గా వ్యవహరిస్తున్న ఈ అధికారి అరవింద్ కుమార్ సింగ్ తన హోదాలో రూ 17 కోట్లను చారియట్ మీడియా అనే కంపెనీకి బదలాయించారు. గోవా ఎన్నికల దశలో ఈ సంస్థ ఆప్ ప్రచార నిర్వహణ బాధ్యతలలో ఉంది. హవాలా లావాదేవీల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ఈ సొమ్ము ఆప్ ప్రచారం కోసం కంపెనీకి వెళ్లినట్లు సిబిఐ అభియోగాలు మోపింది. సంబంధిత విషయంపై సిబిఐ వర్గాలు ప్రాధమిక దర్యాప్తు చేపట్టాయి.
ఈ క్రమంలో వాట్సాప్ ఛాట్స్, హవాలా లావాదేవీల వ్యవహారాలను సిబిఐ నిర్థారించుకుంది. 2021 జూన్ 2022 జనవరి మధ్యకాలంలో ఈ అక్రమలావాదేవీలు సాగేందుకు అరవింద్ కుమార్ సింగ్ కీలక పాత్ర పోషించినట్లు గుర్తించి , ఇప్పుడు అరెస్టుకు దిగినట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి. గోవా ఎన్నికలలో ఔట్‌డోర్ ప్రచార నిర్వహణకు ఈ సొమ్ము వినియోగించినట్లు, దీని మూలాలు లిక్కర్ స్కామ్ పరిధిలో ఉన్నట్లు సిబిఐ పేర్కొంది. గోవా అసెంబ్లీ ఎన్నికలు 2022 ఫిబ్రవరి 14న జరిగాయి. కాగా ఛారియట్ మీడియా సంస్థ యజమాని రాజేష్ జోషిని సంబంధిత కేసులో ఫిబ్రవరి 8న అరెస్టు చేశారు. ఆయన నుంచి రాబట్టిన సమాచారం మేరకు ఇప్పుడు ఈ న్యూస్‌ఛానల్ ప్రముఖుడి అరెస్టు జరిగింది. రాజేష్ జోషికి ఢిల్లీ ప్రత్యేక కోర్టు మే 6వ తేదీన బెయిల్ ఇచ్చింది. తమకు ఈ వ్యవహారాలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి తగు సాక్షాధారాలు లభించాయని , ఛారియట్ మీడియా ఎన్నికల కోసం కొందరు ఏజెంట్లకు చెల్లింపులకు దిగినట్లు పసికట్టినట్లు వెల్లడైంది.
అయితే ఈ చెల్లింపులకు సౌత్‌లాబీ తరఫున సహ నిందితుడు విజయ్ నాయర్‌కు అందిన ముడుపులకు ఏమైనా సంబంధం ఉందా? లేదా అనేది ఇప్పటికిప్పుడు నిర్థారించలేకపోయినట్లు తెలిపిన సిబిఐ ఇప్పుడు అరవింద్ కుమార్ సింగ్ అరెస్టు తరువాతి విచారణతో వివరాలను రాబట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. లిక్కర్ పాలసీ ద్వారా ప్రయోజనాలు సమకూర్చడం ద్వారా ఆమ్ ఆద్మీపార్టీకి వివిధ రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారానికి హవాలా ద్వారా భారీ ఎత్తున సొమ్ము అందిందని దర్యాప్తు సంస్థలు ఓ అభిప్రాయానికి వచ్చాయి. అయితే సంబంధిత అభియోగాలను నిర్థారించేందుకు అవసరం అయిన బలీయ సాక్షాలను దర్యాప్తు సంస్థలు చూపెట్టలేకపోతున్నాయని వివిధ స్థాయిల్లో నిందితులకు బెయిల్ మంజూరి దశల్లో న్యాయస్థానాలు తెలియచేస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు దఫాలుగా లిక్కర్ స్కామ్ సంబంధించి అనుబంధ ఛార్జీషీట్లు దాఖలు చేస్తూ వస్తున్నారు.