న్యూఢిల్లీ: సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు అరుదైన పురస్కారం దక్కింది. భారతీయ సినిమాకు గణనీయమైన సేవలు చేసిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం 2019 సంవత్సరానికి గాను రజనీకాంత్‌ను వరించింది. రజనీకాంత్‌కు 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందించనున్నట్లు గురువారం కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ప్రకటించారు. 1969నుంచి ఈ అవార్డులను ప్రకటిస్తుండగా ఇప్పటివరకు 50 మంది ఈ అవార్డులను అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న 50వ వ్యక్తి అమితాబ్ బచ్చన్. అయితే ఈ నెల 6న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రజనీ కాంత్‌కు ఈ అవార్డు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ 2000లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. 50 ఏళ్లుగా రజనీకాంత్ చలనచిత్ర పరిశ్రమలో మకుటం లేని మహరాజుగా వెలుగొందుతూ ఉన్నాడని, ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అవార్డు ప్రకటిస్తూ జవడేకర్ అన్నారు. అశా భోంస్లే, మోహన్‌లాల్, బిశ్వజిత్ చటర్జీ, శంకర్ మహదేవన్, సుభాష్ ఘాయ్‌లతో కూడిన న్యాయనిర్ణేత బృందం రజనీకాంత్‌ను ఈ అవార్డు కోసం ఏకగ్రీవంగా సిఫార్సు చేసినట్లు చెప్పారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విశేషంగా చెప్పుకునే దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం తనను వరించడంపై సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తన ఈ ప్రయాణంలో తోడుగా సాగిన ప్రతి ఒక్కరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ఉద్వేగ భరిత ట్వీట్ చేశారు. ‘సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ పాల్కే అవార్డుకు నన్ను ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్, ఇతర జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాలోని నటుడ్ని గుర్తించి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన బస్సు డ్రైవర్, నా స్నేహితుడు రాజ్‌బహదూర్, పేదరికంలో ఉన్నప్పటికీ నన్ను నటుడిని చేయడం కోసం ఎన్నో త్యాగాలు చేసిన నా పెద్దన్నయ్య సత్యనారాయణ రావు గైక్వాడ్, అలాగే ఈ రజనీ కాంత్‌ను సృష్టించిన నా గురువు బాలచందర్‌తో పాటు.. నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు, మీడియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అశేష అభిమానులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్, కమల్‌హాసన్‌తో పాటు ఇతర రాజకీయ, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరికీ నా కృతజ్ఞతలు. జైహింద్!!’ అని రజని పేర్కొన్నారు.
ప్రధాని హర్షం
సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. రజనీకాంత్‌కు అభినందనలు తెలుసుతూ ఆయన ట్వీట్ చేశారు. ‘తలైవాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించడం ఎంతో సంతోషంగా ఉంది. రజనీకి అభినందనలు. కఠోరంగా శ్రమించే అరుదైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. విభిన్నమైన పాత్రలు పోషించే అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న మంచి మనిషి రజనీ కాంత్’ అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని ట్వీట్‌కు రజనీ సమాధానమిస్తూ, తనకు అభినందనలు తెలియజేయడంతో పాటు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రకటించినందుకు మీకు, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు. కాగా రజనీకాంత్‌కు దాదా సాహెబ్ అవార్డు ప్రకటించడం పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. విలక్షణ నటుడు కమలహాసన్, తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఒ పన్నీర్ సెల్వం, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ తదితరులు ఆయనకు అభినందనలు తెలియజేసిన వారిలో ఉన్నారు.
Rajinikanth emotional tweet on Dadasaheb Phalke Award