సూపర్ స్టార్ రజనీకాంత్ తాను పనిచేసిన బస్ డిపోకు వెళ్లి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. రజనీకాంత్ సినిమా హీరో కాకముందు ఆర్టీసి బస్సు కండక్టర్ గా పనిచేసిన విషయం అందరికి తెలిసిందే. మంగళవారం బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్(బిఎంటిసి) పరిధిలోని జయానగర్ బస్ డిపోకు తన స్నేహితుడు రాజ్ బహద్దూర్ తో కలిసి వెళ్లారు. బస్సు డిపో ప్రాంగణంలో కలియతిరుగుతూ గతంలో తాను పనిచేసిన సమయంలో పాత జ్ఞాపాకలను గుర్తు చేసుకున్నారు. డిపోలో ఉన్న కండక్టర్లు, డ్రైవర్లు, మెకానికులను కలిసి వారితో సరదాగా కాసేపు గడిపారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా తమ వద్దకు రావడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేస్తూ రజనీకాంత్ తో ఫోటోలు దిగారు. రజనీకాంత్ తమ వద్దకు రావడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని, ఆయన సింప్లిసిటీకి సెల్యూట్ అని అక్కడున్న ఆర్టీసి సిబ్బంది పేర్కొన్నారు.
కాగా, మరాఠి కుటుంబంలో జన్నించిన రజనీకాంత్.. సినిమా యాక్టర్ కంటే ముందు శివాజీరావు గైక్వాడ్ పేరుతో బెంగళూరులో ఆర్టీసి బస్సు కండక్టర్ గా పనిచేశారు. ఈ క్రమంలో తన స్నేహితుడు, బస్సు డ్రైవర్ రాజ్ బహద్దూర్ సలహా మేరకు రజనీకాంత్ సినిమా రంగంలోకి ప్రవేశించి సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు.