మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులు ఆరుగురిని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు తీసుకొన్న నిర్ణయం మానవీయమైనది. ముప్పై సంవత్సరాలకు పైగా శిక్ష అనుభవించిన తర్వాత సత్ప్రవర్తన ఆధారంగా సుప్రీంకోర్టు వీరి విడుదలకు ఆదేశించింది. నళిని, శ్రీహరన్, ఆర్‌పి రవిచంద్రన్, శంతన్, మురుగన్, రాబర్ట్ పాయాస్, జయకుమార్‌లకు స్వేచ్ఛను ప్రసాదించింది. జైల్లోవారి ప్రవర్తన సంతృప్తికరంగా వుందని కారణం చూపించింది. 1991 మే 21 రాత్రి రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు తమిళనాడు శ్రీపెరుంబుదూర్‌లో ధాను అనే మహిళా ఆత్మాహుతి బాంబు దాడిలో హతుడయ్యాడు. ఈ కేసులో 26 మందికి టెర్రరిస్టు, విచ్ఛిన్నకర శక్తుల నిరోధక చట్టం (టాడా) కింద మరణ శిక్ష విధించారు.
టాడా చట్టం కథ కంచికి వెళ్లిన తర్వాత కొద్ది సంవత్సరాలకు వీరిలో ఏడుగురి శిక్షలను మాత్రమే ఖరారు చేసి మిగతా వారిని సుప్రీంకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. శ్రీలంక తమిళ ప్రాంతాల్లో అశాంతి అంతర్యుద్ధం నేపథ్యంలో భారత ప్రధానిగా అక్కడికి సేనలను పంపించి తమ వారి వూచకోతకు కారణమయ్యాడనే కోపంతో రాజీవ్ గాంధీని హత్య చేశారు. శిక్షలు ఖరారైన ఏడుగురిలో పెరారివాలన్, ఎస్ నళిని, శంతన్, శ్రీహరన్‌లకు మరణ శిక్షలు, మిగతా వారికి యావజ్జీవ ఖైదు పడ్డాయి. నళిని గర్భవతిగా వున్నందున ఆమె మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని సోనియా గాంధీ చేసిన విజ్ఞప్తికి 2000లో సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం ఆలస్యమవుతున్నదనే కారణంపై పెరారివాలన్, శ్రీహరన్, శంతన్‌ల మరణ శిక్షలను సైతం 2014లో యావజ్జీవ శిక్షలుగా మార్చి వేసింది.
వీరందరికీ క్షమాభిక్షలు పెట్టి విడుదల చేయించాలని 2018లో అప్పటి ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సారథ్యంలో తమిళనాడు మంత్రివర్గం గవర్నర్ బనవరిలాల్ పురోహిత్‌కు సిఫారసు చేసింది. అప్పటి ప్రతిపక్ష నేత డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ దానికి మద్దతు పలికాడు. గవర్నర్ దానిని కేంద్రానికి నివేదించడం ద్వారా నిరవధిక నిల్వలో ఉంచారు. పెరారివాలన్‌ను సుప్రీంకోర్టు గత మే నెలలో విడుదల చేసింది. అదే విధంగా తమను కూడా విడుదల చేయాలని నళిని, రవి చంద్రన్ పిటిషన్ పెట్టుకోడంతో అత్యున్నత న్యాయస్థానం మొత్తం అందరి విడుదలకు ఆదేశించింది. పూర్తి కాలం శిక్ష అనుభవించనీయకుండా ముందుగా విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు శిక్ష అనుభవిస్తున్నవారి పట్ల దయతోనే వ్యవహరించింది. క్షమాభిక్ష ప్రార్ధనపై నిర్ణయ జాప్యం అవుతున్నందున మరణ శిక్షలను యావజ్జీవ శిక్షలుగా మార్చింది.
పెరారివాలన్‌ను విడుదల చేసిన సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన ఒక వ్యాఖ్య గమనించదగినది. రాష్ట్రపతి మాత్రమే క్షమాభిక్ష పెట్టాలని గవర్నర్‌కు ఆ హక్కు లేదని కేంద్రం వెలిబుచ్చిన అభిప్రాయాన్ని తిరస్కరిస్తూ అలా అయితే క్షమాభిక్ష పెట్టే హక్కును గవర్నర్లకు కట్టబెడుతున్న రాజ్యాంగం 161అధికరణ అర్థం లేనిది అవుతుందని వ్యాఖ్యానించింది. శిక్ష అనుభవిస్తూనే విద్యలో ప్రావీణ్యం సంపాదించుకోడానికి వీరు చేసిన కృషి కూడా హర్షించదగినది. పెరారివాలన్ తమిళనాడు ఓపెన్ వర్సిటీ పెట్టిన డిప్లొమా పరీక్షలో బంగారు పతకం సాధించాడు. ఈ విషయాన్నీ సుప్రీం ధర్మాసనం పరిగణనలోకి తీసుకొని వుండాలి. మొత్తం మీద సుదీర్ఘ కాలం శిక్ష అనుభవించిన తర్వాత కూడా వారు జైల్లోనే తుది శ్వాస విడవాలని కోరుకోడం సమంజసం కాదు. ఖైదీల్లో జైలు పరివర్తన తీసుకు రావాలి.
అందుకోసమే శిక్ష. నాగరకత పెరుగుతున్న కొద్దీ సమాజాల ఆలోచనలో మానవీయ మార్పులు వస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఉరి శిక్షను రద్దు చేశారు. రాజీవ్ గాంధీ హత్య అత్యంత దారుణమైనది. దానికి బాధ్యులైన వారిని శిక్షించవలసిందే. అయితే మూడు దశాబ్దాలకు పైగా శిక్ష అనుభవించిన తర్వాత వారి విడుదల అభ్యర్థనను పట్టించుకోకుండా వుండడం తగదు. 14 సంవత్సరాలకు మించి శిక్ష అనుభవించిన వారికి క్షమాభిక్ష పెట్టే విషయాన్ని ప్రభుత్వాలు, గవర్నర్లు పట్టించుకోవాలని గతంలోనే చెప్పిన సుప్రీంకోర్టు రాజ్యాంగం 142 అధికరణ తనకిచ్చిన ప్రత్యేకాధికారాలను ఉపయోగించి వీరి విడుదలకు ఆదేశించడంలోని సహేతుకతను గౌరవించాలి. దేశ చరిత్రలో అత్యంత విషాద ఘట్టం ఈ విధంగా ముగింపుకి వచ్చింది.