Wednesday, September 18, 2024

దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ ప్రాణత్యాగం చేశారు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దివంగత మాజీ ప్రధానులు నెహ్రు, ఇందిరా, రాజీవ్ గాంధీలు దేశంలో సాగు నీటి ప్రాజెక్టులు కట్టారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 1980లో  దేశానికి టెక్నాలజీ పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని ప్రశంసించారు. పంచాయతీరాజ్ వ్యవస్థలు రాజీవ్ గాంధీ బలోపేతం చేశారన్నారు. సోమాజిగూడలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సిఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, విహెచ్, మేయర్ విజయలక్ష్మి, జగ్డారెడ్డి. పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పట్టుదలతోనే తెలంగాణ సాధ్యమైందన్నారు. దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత రాజీవ్ కే దక్కుతుందన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రాజీవ్ గాంధీ రిజర్వేషన్లు తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. సచివాలయం ముందు రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని బిఆర్‌ఎస్ నేతలు అంటున్నారని, బిఆర్‌ఎస్ నేతలకు అధికారం పోయినా పొగరు తగ్గలేదని విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమ ముసుగులో బిఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపణలు చేశారు. భవిష్యత్‌లోనూ బిఆర్‌ఎస్ నేతలకు అధికారం ఒక కల అని ఎద్దేవా చేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కుటుంబాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని రేవంత్ ప్రశ్నించారు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని, యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీని రాష్ట్రంలో ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నైతికత, చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News