హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ స్వగృహ టవర్లను అమ్మకానికి పెట్టింది. ఇప్పటి వరకు రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను విడిగా అమ్మకానికి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏకమొత్తంగా టవర్ల అమ్మకాన్ని చేపట్టింది. పోచారం, గాజులరామారంలోని ఇంకా మొత్తం పనులు పూర్తి కాని టవర్ల విక్రయానికి శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు చోట్లా టవర్ల వారీగా విక్రయించనున్నారు. పోచారంలో నాలుగు, గాజులరామారంలో ఐదు టవర్లను అమ్మకానికి పెట్టారు. పోచారంలోని ఒక్కో టవర్లో 72 నుంచి 198 ఫ్లాట్లు ఉండగా, గాజుల రామారంలోని ఒక్కో టవర్లో 112 ఫ్లాట్లు ఉన్నాయి.
ఆసక్తి కలిగిన సంస్థలు, వ్యక్తులు టవర్ మొత్తం వ్యయంలో రెండు శాతం ఈఎండీ సమర్పించాలని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తెలిపింది. ఈఎండి సమర్పించేందుకు జనవరి 30వ తేదీ వరకు గడువు ఇచ్చారు. లాటరీ ద్వారా టవర్లను కేటాయిస్తారు. www.hmda.gov.in, www.swagruha.telangana.gov.in వెబ్‌సైట్‌లో టవర్ల వివరాలు, పూర్తి సమాచారాన్ని అధికారులు అందుబాటులో ఉంచారు.