సిఎంకు ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి బహిరంగ లేఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువు పొడిగించాలని ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షులు యడవల్లి వెంకటస్వామి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు, ఎంఎల్‌సి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌లను అభ్యర్థిస్తూ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యుఐ) తరపున ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షుడికి అభినందనలు తెలిపిన ఆయన రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగ యువతకు ఆశాజ్యోతి వెలిగించిన ‘రాజీవ్ యువ వికాసం‘ పథకాన్ని ప్రారంభించినందుకు తెలంగాణ యువత తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా సాధికారత కల్పించేందుకు రూపుదిద్దిన ఈ పథకం, రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా యువజన సంక్షేమానికి మార్గదర్శకంగా నిలిచిందని విశ్వాసం వ్యక్తం చేశారు. యువతను ఆత్మనిర్బరులుగా తీర్చిదిద్దే ఈ సంకల్పం, రాష్ట్ర యువతలో విశేష ప్రశంసలు పొందుతోందని ఆయనన్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14తో ముగియనున్న దరఖాస్తు గడువును మరో 10 రోజుల పాటు పొడిగించాలని ఆయన తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో అర్హులైన అభ్యర్థులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను, ముఖ్యంగా ఎంఆర్‌ఓ కార్యాలయాలు, సంబంధిత శాఖల నుండి, పొందడంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని, అందువల్ల రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్రంలోని ప్రతి అర్హులైన యువకులకి అందించాలన్న సంకల్పాన్ని నిలబెట్టుకునేందుకు గడువు తేదీని మరో 10 రోజుల పాటు పొడిగించాల్సిన అవసరం ఉందని ఆయనన్నారు.