డిక్లాసిఫైడ్ చెర నుంచి విముక్తి
న్యూఢిల్లీ : ఇకపై ఏ యుద్ధం ఎందుకు జరిగిందీ? వాటి సకల సమాచారం ఏమిటీ? అనేది సైనికలోగుట్టుగా ఉండబోదు. యుద్ధ చరిత్రలను ఎప్పటికప్పుడు ప్రచురించి ప్రజలకు వీటి గురించి వాస్తవికతలను తెలియచేసే బృహత్తర విధానానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం తమ ఆమోదం తెలిపారు. జాతీయ భద్రతా కోణంలో ఇప్పటివరకూ యుద్ధాలకు సంబంధించిన అంశాలను , పత్రాలను రహస్యంగానే ఉంచుతూ వస్తున్నారు. అయితే యుద్ధ వివరాలను చరిత్రగా పొందుపర్చడం, వాటిని వెలుగులోకి తేవడం,రక్షణ మంత్రిత్వశాఖ చేపట్టిన మెరుపుదాడులు, చరిత్రలను సమీకరించుకుని, వాటిని వాస్తవిక చరిత్రగా వెలువరిస్తారు. ఎప్పటికప్పుడు దీనిని పుస్తక రూపంలో తేవడం వల్ల విద్యావిషయక పరిశోధనలకు మార్గం ఏర్పడుతుంది. యుద్ధాలపై అసంబద్ధ వదంతులను నివృత్తి చేసే దిశలో ఈ పాలసీని తీర్చిదిద్దుతున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన వెలువరించింది. పాలసీలో భాగంగా రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన త్రివిధ బలగాలు, సమీకృత రక్షణ సిబ్బంది, అస్సామ్ రైఫిల్స్, భారతీయ తీర రక్షక దళం తమ వద్ద ఉన్న రికార్డులను ఎప్పటికప్పుడు మంత్రిత్వశాఖకు పొందుపర్చాలి.
వార్ డైరీలను, ఏదైనా ఆపరేషన్ చేపడితే సాగే ఉత్తర ప్రత్యుత్తరాలు, నిర్వాహక సరళి వంటి వాటిని మంత్రిత్వశాఖకు చెందిన చరిత్ర విభాగానికి అందించాల్సి ఉంటుంది. సంబంధిత పాలసీ ఫైలుకు రక్షణ మంత్రి అంగీకారం తెలిపారని అధికారవర్గాలు తెలిపాయి. రికార్డులను పాతికేళ్ల దశలో పూర్తిస్థాయిలో బహిరంగ పర్చడం జరుగుతుంది.కార్గిల్ వార్ తరువాతి క్రమంలో మంత్రుల స్థాయి బృందం చేసిన సిఫార్సులలో యుద్ధ చరిత్ర అధికారిక రికార్డులు ప్రజలముందుకు తీసుకురావడంపై అంగీకారం తెలిపింది. రక్షణ మంత్రిత్వశాఖ కొన్ని సందర్భాలలో చేపట్టిన మెరుపుదాడుల సంబంధిత వివరాలు రహస్యంగా ఉంటూ వస్తున్నాయి. దీనితో పలు రకాల విమర్శలకు దారితీస్తున్నాయి. యుద్ధాలకు సంబంధించిన వాస్తవాలు తరువాతి దశలో చరిత్రలో వక్రీకరణకు గురికాకుండా చేసేందుకు కొత్త పాలసీకి శ్రీకారం చుట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.