Monday, December 23, 2024

చైనా బలగాలను తిప్పికొట్టాం

- Advertisement -
- Advertisement -

చైనాను దీటుగా తిప్పికొట్టాం
తవాంగ్ ఘర్షణపై పార్లమెంటులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రకటన
రాజ్యసభలో వివరణలకు విపక్షాల పట్టు, వాకౌట్
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖను అతిక్రమించి ప్రస్తుత పరిస్థితిని ఏకపక్షంగా మార్చేందుకు చైనా ప్రయత్నించిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో భారత భూభాగంలోకి చొచ్చుకు రావడానికి యత్నించిన చైనా బలగాల దుశ్చర్యను భారతదళాలు దీటుగా తిప్పికొట్టాయని ఆయన వెల్లడించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారతచైనా బలగాల మధ్య ఈ నెల 9న జరిగిన ఘర్షణపై రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం లోక్‌సభలో ప్రకటన చేశారు. ఆయన రాజ్యసభలో కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు. ‘ఇరు దేశాల సైనికుల మధ్య ఈ నెల 9న ఘర్షణ జరిగింది. చైనా పిఎల్‌ఎ సైనికులు భారత భూబాగంలోకి చొచ్చుకు రావడానికి యత్నించారు. ప్రస్తుత పరిస్థితిని ఏకపక్షంగా మార్చడానికి యత్నించారు. అయితే వారి ప్రయత్నాలను భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

భారత భూభాగంలోకి చైనా బలగాల అతిక్రమణను మన సైనికులు ధైర్యంగా అడ్డుకున్నారు. చైనా సైనికులు తిరిగి తమ పోసుల్ట వైపు వెళ్లేలా చేయగలిగారు’ అని రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ‘తాజా ఘర్షణలో ఇరువైపు సైనికులకూ గాయాలయ్యాయి. అయితే భారత సైన్యంలో ఎవరూ చనిపోలేదు. ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. సరైన సమయంలో కమాండర్ల జోక్యంతో పిఎల్‌ఎ సైనికులు వెనక్కి వెళ్లిపోయారు. అనంతరం భారత సైన్యానికి చెందిన స్థానిక కమాండర్ చైనా రక్షణ శాఖ అధికారులతో ఈ నెల 11ఫ్లాగ్ మీటింగ్ జరిపి ఈ అంశంపై చర్చించారు.ఈ దుశ్చర్యను భారత్ తరఫున ఖండించారు. శాంతి స్థాపనకు చొర చూపాలని సూచించారు. దౌత్య మార్గాల ద్వారా కూడా ఈ విషయాన్ని చైనా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. భారత బలగాలు దేశ సమగ్రతను కాపాడే విషయంలో కట్టుబడి ఉన్నాయి.

ఈ క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి’ అని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. అంతకు ముందు తవాంగ్ ఘటనపై కాసేపు ఉభయ సభలూ వాయిదా పడ్డాయి. తవాంగ్ ఘటనపై చర్చ జరపాలని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌధరి, డిఎంకె సభ్యుడు టిఆర్ బాలు,ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీనిపై ప్రకటన చేస్తారని తెలిపారు. అయితే దీనిపై చర్చ జరగాలని విపక్ష సభ్యులు ఆందోళన చేయడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఈ అంశాన్ని లేవనెత్తి ప్భుత్వం దీనిపై వివరణ ఇవ్వాలని బిమాండ్ చేశారు.

రాజ్యసభలో విపక్షాల వాకౌట్
కాగా రక్షణ మంత్రి ప్రకటనపై వివరణలు అడగడానికి అనుమతించక పోవడంతో రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, శివసేన, ఆర్‌జెడి, ఎస్‌పి జెఎంఎం పార్టీల సభ్యులు కూడా కాంగ్రెస్‌తో పాటుగా వాకౌట్ చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తవాంగ్ ఘటనపై సభలో ప్రకటన చేయగానే కాంగ్రెస్ సభ్యులు దానిపై వివరణకు పట్టుబట్టారు. అయితే ఇది సున్నితమైన అంశంం అయినందున దీనిపై ఎలాంటి వివరణలనూ అనుమతించడం లేదని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ స్పష్టం చేశారు. గతంలో సున్నితమైన అంశాలపై వివరణ ఇవ్వని పలు సందర్భాలను కూడా ఆయన ఉదహరించారు. అయితే ప్రభుత్వం వివరణ ఇవ్వనప్పుడు సభలో పల ఉండడంలో అర్థం లేదంటూ కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. మిగతా ప్రతిపక్షాల సభ్యులు కూడా వాకౌట్ చేశారు.

‘చైనా చొరబాటుపై విపక్షం పదేపదే వివరణకోరింది. అయితే ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వలేదు. రక్షణ మంత్రి ప్రకటన చేసిన వెంటనే సభనుంచి వెళ్లిపోయారు. ఇది దేశానికి మంచిది కాదు’ అని రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే వాకౌట్ అనంతరం సభ వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. ప్రభుత్వం వివరణలు ఇవ్వడానికి నిరాకరించిన తర్వాత సభలో కూర్చోవడంలో అర్థం లేదన్నారు. అయితే తమ పార్టీ సాయుధ దళాలకు సంఘటితంగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. డిప్యూటీ చైర్మన్ పలు గత సంప్రదాయాలను ఉదహరించారు కానీ1962 పార్లమెంటు సమావేశంలో భారత్‌చైనా యుద్ధంపై సభలో చర్చించిన విషయాన్ని ఎవరైనా ఎలా మరిచిపోతారని ఆర్‌జెడి ఎంపి మనోజ్ ఝా అన్నారు. కాగా, ఎంపిలకు వారి పార్లమెంటు హక్కులను నిరాకరిస్తున్నారని శివసేన ఎంపి ప్రియాంక చతుర్వేది అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News