Friday, November 22, 2024

అగ్నివీరులకు రక్షణ శాఖలో 10% రిజర్వేషన్

- Advertisement -
- Advertisement -

అగ్నివీరులకు రక్షణ శాఖలో 10% రిజర్వేషన్
సిఎపిఎఫ్, అస్సాం రైఫుల్స్ నియామకాల్లోను 10 శాతం కోటా
గరిష వయోపరిమితిలోనూ సడలింపులు
అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో కేంద్రం మరో ఆఫర్
న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకు వచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు పెట్టుబుకుతున్న వేళ యువతకు దీనిపై మరింత విశ్వాసం కలిగించేలా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా సైన్యంలో పని చేసి పదవీ విరమణ పొందే అగ్నివీరులకు రక్షణ శాఖ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు శనివారం రక్షణ శాఖ ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన చేసింది. ‘తగిన అర్హతలున్న అగ్నివీరులకు రక్షణ శాఖ ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించడానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలియజేశారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్, డిఫెన్స్ సివిల్ పోస్టులతో పాటుగా 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ విభాగాలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఎక్స్ సర్వీస్‌మెన్ కోటాతో పాటుగా ఈ రిజర్వేషన్ అమలు అవుతుంది. ఇందుకోసం నియామక నిబంధనల్లో తగు సవరణలు చేయనున్నాం. వయోపరిమితి సడలింపు కూడా చేయనున్నాం’ అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అగ్నిపథ్ పథకంపై నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం ఉదయం త్రివిధ దళాల అధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి చర్చించారు.

ఈ సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో వైపు అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సిఎపిఎఫ్), అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా ఈ రెండు బలగాల్లో చేరడానికి కావలసిన గరిష్ఠ వయోపరిమితిలో కూడా అగ్నివీరులకు మూడేళ్ల సడలింపు ఇవ్వనున్నట్లు కేంద్ర హోం శాఖ కార్యాలయం ప్రకటించింది.ఇతర మంత్రిత్వ శాఖలు కూడా ఇదే విధమైన అవకాశాలు కల్పించే దిశగా ఆలోచన చేస్తున్నాయి. తమ మంత్రిత్వ శాఖల కింద చాలా పిఎస్‌యులు ఉన్నాయని, అగ్నిపథ్ కింద సైన్యంలో పని చేసి రిటైరయిన వారికి వాటిలో నియమించుకునేందుకు అవకాశముంటే తప్పకుండా ప్రయత్నిస్తామని కేంద్ర గృహనిర్మాణం,చమురు మంత్రిత్వ శాఖల మంత్రి హర్‌దీప్ సింగ్ పురి శనివారం ఓ కార్యక్రమంలో చెప్పారు.

Rajnath Singh Approves 10% Reservation in Defence

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News