ఆర్మీ ఉద్యోగాల భర్తీకి డిమాండ్
న్యూఢిల్లీ : యూపీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ప్రసంగానికి యువకుల నిరసన నినాదాలు అడ్డు తగిలాయి, గోండా జిల్లాలో ప్రచార సభలో ఆయన మాట్లాడుతుండగా యువకులు ఒక్కసారిగా లేచి నినాదాలు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఆర్మీలో ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బిగ్గరగా నినాదాలు చేశారు. వేదికపై ఉన్న మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌కు యువకులు ఎందుకు నినాదాలు చేస్తున్నారో సరిగ్గా అర్థం కాలేదు. పక్కనున్న నేతలను అడగ్గా ఆర్మీ లోని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారని వివరించారు.
సేనాభర్తీ చలూ కరో(ఆర్మీ రిక్రూట్‌మెంట్ భర్తీ చేయండి) …హమారీ మాంగే పూరీ కరో( మా డిమాండ్ నెరవేర్చండి) అని యువకులు నినాదాలు చేశారు. నిరసన చేస్తున్న యువకులను మంత్రి రాజ్‌నాధ్ శాంతపర్చడానికి ప్రయత్నించారు. “మీ ఆందోళన మాకూ ఉంది. కరోనా కారణంగా కొన్ని చిక్కులు ఎదురయ్యాయి” అని మంత్రి వారిని సమాధానపరిచారు. తరువాత మంత్రి ఒత్తిడిపై ప్రతివారూ భారత్‌మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. యూపీలో మళ్లీ బిజెపికి ఓటేసి గెలిపిస్తే బిజెపి ప్రభుత్వం హోలీ, దీపావళి పండగలకు ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.