పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) తమదే అన్న వాదనను భారత్ ఎన్నటికీ విడనాడదని రక్షణ శాఖ మంత్రి ప్రకటించారు. అయితే, దానిని బలవంతంగా స్వాధీనం చేసుకోవలసిన అవసరం ఉండదని, ఎందుకంటే కాశ్మీర్‌లో అభివృద్ధిని చూసిన తరువాత అక్కడి ప్రజలు భారత్‌లో భాగం కావాలని కోరుకుంటారని ఆయన చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని, ఆ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎఎఫ్‌ఎస్‌పిఎ (సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం) అమలు ఇక ఎంత మాత్రం అవసరం లేని సమయం వస్తుందని రాజ్‌నాథ్ అన్నారు.
అయితే, ఆ విషయం కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ పరిధిలోనిదని, అది సముచిత చర్యలు తీసుకుంటుందని రక్షణ శాఖ మంత్రి చెప్పారు. అక్కడ తప్పకుండా ఎన్నికలు జరుగుతాయని, కాని ఎప్పుడు జరిగేదీ సూచించలేమని ఆయన తెలిపారు. ‘భారత్ ఏమీ చేయవలసిన అవసరం ఉండదని నా భావన. జమ్మూ కాశ్మీర్‌లో వాస్తవ పరిస్థితి మారిన తీరు, ఆ ప్రాంతం ఆర్థిక ప్రగతి సాధిస్తున్న తీరు, అక్కడ తిరిగి శాంతి నెలకొన్న విధం బట్టి తాము భారత్‌లో విలీనం అవుతామని పిఒకె ప్రజల నుంచి డిమాండ్లు వస్తాయని భావిస్తున్నా’ అని రాజ్‌నాథ్ చెప్పారు. పిఒకెను స్వాధీనం చేసుకోవలసిన అవసరం తమకు ఉండదని, ‘పిఒకె ఎప్పటికీ మనదే’ అని మంత్రి స్పష్టం చేశారు.