న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో రెండేళ్ల క్రితం చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవాన్లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం నివాళులర్పించారు. 2020 జూన్ 15-16 తేదీల్లో తమ దేశ గౌరవాన్ని కాపాడేందుకు వీరోచిత పోరాటం చేసి అమరులైన గల్వాన్ అమరవీరులకు స్మరించుకుంటూ వారి ధైర్య పరాక్రమాలను, దేశం కోసం వారు చేసిన ప్రాణత్యాగాన్ని ఎన్నటికీ మరువలేమని పేర్కొంటూ రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన జమ్మూ కశ్మీరులో పర్యటనలో ఉన్నారు. గల్వాన్ లోయలో చైనా సైనికులతో ఘర్షణలు చెలరేగి 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ పరిణామంతో తూర్పు లడఖ్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడి ఇప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతోంది.
ఈ ఘర్షణల్లో ఐదుగురు చైనా సైనికాధికారులు మరణించినట్లు గత ఏడాది ఫిబ్రవరిలో చైనా అధికారికంగా ప్రకటించింది. గల్వాన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద చైనా సైనికుల దురాక్రమణను వీరోచితంగా అడ్డుకున్న భారత సైనికులకు సారథ్యం వహించి అమరుడైన 16 బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బి సంతోష్ బాబుకు గత ఏడాది నవంబర్‌లో భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత సైనిక పురస్కారం మహావీర్ చక్రను మరణానంతరం అందచేసింది. తూర్పు లడఖ్‌లోని 120 పోస్టు వద్ద గల్వాన్ అమరవీరుల స్మారకార్థం ఒక గాలంట్స్ ఆఫ్ గల్వాన్‌ను సైన్యం నిర్మించింది.