తిరువనంతపురం: కాంగ్రెస్ కంచుకోటగా చెప్పుకునే అమేథీ నియోజకవర్గం నుంచి ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేస్తారో ఇంకా ఆ పార్టీ నిర్ణయించలేదు. దీనిపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
“2019లో జరిగిన ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసిన రాహుల్ ఓటమి చెందారు. అందుకే ఈసారి అక్కడ నుంచి పోటీ చేయడానికి ధైర్యం చేయలేక పోతున్నారు. ఈ ప్రభావంతో ఉత్తరప్రదేశ్ నుంచి కేరళకు కాంగ్రెస్ నేత వలస వచ్చారు. వయనాడ్ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న రాహుల్‌ను మరోసారి తమ ఎంపీగా ఎన్నుకోవద్దని అక్కడి ప్రజలు భావిస్తున్నట్టు విన్నాను” అని రాజ్‌నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు.
భారత్‌లో ఎన్నో కొత్త అంతరిక్షప్రయోగాలు, ఇతర ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు ప్రయోగిస్తున్నా, హస్తం పార్టీ తమ యువనేత రాహుల్‌యాన్‌ను గత 20ఏళ్లుగా లాంచ్ చేయలేక పోతోంది. అంటూ రాజ్‌నాథ్ సింగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పందించారు. ఆ స్థానం నుంచి రాహుల్ పోటీ చేయాలని తాను ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. అమేథీ నుంచి ఆయన ఎందుకు పోటీ చేయలేక పోతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనే అంశంపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రాహుల్ ఇప్పటికే స్పష్టం చేశారు.