న్యూఢిల్లీ : ప్రధాని మోడీ అధికారంలో ఉండగా భారత దేశం నుంచి ఒక్క అంగుళం భూమిని ఆక్రమించలేరని, పీఓకే (పాక్ ఆక్రమిత కశ్మీర్) భారత్‌దేనని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా, పాకిస్థాన్‌లకు హెచ్చరించారు. దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొని ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌పై దుష్ప్రచారం చేసే వారికి తగిన గుణపాఠం చెబుతామని ఆయన స్పష్టం చేశారు.
ఉగ్రవాద భారాన్ని పాకిస్థాన్ భరించాల్సి వస్తుందని, ఉగ్రవాదాన్ని నియంత్రించలేమని పాకిస్థాన్ భావిస్తే ఉగ్రవాద నిర్మూలనకు భారతదేశం పాక్‌కు సహకరించడానికి సిద్ధంగా ఉందన్నారు. సంభాల్‌లో జరిగిన బహిరంగ సభలో మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 ని తొలగించినప్పటి నుంచి వేర్పాటు వాదం రాళ్ల దాడి వంటి సంఘటనలు జరగలేదని, కశ్మీర్ ప్రశాంతంగా ఉందని తెలిపారు. తమను కూడా కశ్మీర్‌లో భాగం చేయాలని పీఓకే ప్రజలు చెప్పే అవకాశం ఉందని రాజ్‌నాథ్ వివరించారు.