Saturday, November 23, 2024

సముద్రంలో ఎక్కడ దాగినా వేటాడుతాం

- Advertisement -
- Advertisement -

ముంబయి: భారత్‌కు వస్తున్న వాణిజ్య నౌకలపై ఇటీవల జరుగుతున్న దాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. వాణిజ్య నౌకలపై వరస దాడుల నేపథ్యంలో సముద్ర జలాల్లో గస్తీని ముమ్మరం చేసినట్లు తెలిపారు. నౌకలపై దాడులకు పాల్పడిన వారు సముద్రంలో ఎక్కడ దాగినా వేటాడి పట్టుకుంటామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ నౌక ‘ ఐఎన్‌ఎస్ ఇంఫాల్’ను మంగళవారం ముంబయి వేదికగా నౌకాదళంలోకి క్రవేశపెట్టిన నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ తీరానికి సమీపంలో అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ‘ ఎంవి కెమ్ ప్లూటో’పై ఈ నెల 23న డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై స్పందించిన భారత నౌకాదళం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.కోస్టుగార్డు గస్తీ నౌక ‘ ఐసిజిఎస్ విక్రమ్’ రక్షణలో ఆ వాణిజ్య నౌక ముంబయి పోర్టుకు చేరుకుంది. కాగా అమెరికాకు చెందిన వాణిజ్య నౌక ‘ కెమ్ ప్లూటో’పై దాడి ఇరాన్ భూభాగంపైనుంచే జరిగిందని అమెరికా ఆరోసించింది. అయితే అమెరికా ఆరోపణలను ఇరాన్ ఖండించింది. అంతకు ముందు ‘ ఎంవి సాయిబాబా’ అనే మరో భరతీయ వాణిజ్య నౌకపైనా దాడి జరిగింది. ఈ పరిణామాల మధ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ఈ హెచ్చరికలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.కాగా ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్‌తో పాటుగా నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్ హరికుమార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తదితరులు పాల్గొన్నారు. దేశ భద్రత విషయంలో ప్రభుత్వ నిద్ధత, భారత స్వావలంబనకు ఐఎన్‌ఎస్ ఇంఫాల్ నిదర్శనమని రక్షణ మంత్రి పేర్కొన్నారు.

హిందూ మహాసముద్రంలో చైనా నేవీ కదలికలు పెరుగుతున్న వేళ.. మన దేశ రక్షణ సామర్థానికి ఇది మరింత పదును పెడుతుంది. ఐఎన్‌ఎస్ ఇంఫాల్ పొడవు163 మీటర్లు, బరువు 7,400 టన్నులు. భారత నౌకాదళానికి చెందిన ‘వార్‌షిప్ బ్యూరో’ దేశీయంగా డిజైన్ చేసిన నాలుగు ‘ విశాఖపట్నం’ క్లాస్ డెస్ట్రాయర్‌లలో ఇది మూడవది. ఈ యుద్ధ నౌకను ముంబయిలోని మజగావ్ డాక్‌యార్డ్ నిర్మించింది. ఇందులో అత్యధునాతన ఆయుధాలు, సెన్సర్లు ఉన్నాయి. ఉపరితలంనుంచి గగనతలంలోని లక్షాలను ఛేదించగల క్షిపణులు, నౌకా విధ్వసక ఆయుధాలు,టోర్పిడోలను ఈ యుద్ధనౌకలో మోహరిస్తారు. బ్రహ్మోస్ క్షిపణులు కూడా ఇందులో ఉంటాయి.2017 మేలో దీని నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి.2019 ఏప్రిల్‌లో జలప్రవేశం చేయించారు. 2023 ఏప్రిల్ 28నుంచి పూర్తిస్థాయి ట్రయల్ నిర్వహించారు. ఆరు నెలల్లోనే అక్టోబర్‌లో నౌకాదళానికి అప్పగించారు. నిర్మాణం, పరీక్షలను అతితక్కువ వ్యవధిలో పూర్తి చేసుకున్న స్వదేశీ నౌక ఇదే కావడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News