పాక్, చైనాకు రాజ్‌నాథ్ హెచ్చరిక
పితోరాగఢ్: పొరుగుదేశాలతో సత్సంబంధాలనే భారత్ కోరుకుంటోందని, అయితే తమ భూభాగంలో అంకుళం భూమిని ఆక్రమించుకోవడానికి ఎవరు ప్రయత్నించినా గట్టిగా జవాబు ఇస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్ జిల్లాలో జౌల్‌ఖేత్ మూనాకోట్ నుంచి షహీద్ సమ్మాన్ రెండవ దశ యాత్ర శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఇతర దేశాల భూభాగాన్ని భారత్ ఎన్నడూ ఆక్రమించుకోలేదని, పొరుగుదేశాలతో సత్సంబంధాలు కొనసాగించడం భారతదేశ సంస్కృతని అన్నారు. అయితే ఈ భావనను కొందరు అర్థం చేసుకోవడం లేదని, అది వారి అలవాటో లేక ఆలోచనా ధోరణో తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా భారత్‌ను అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని, ఆ దేశానికి ఇప్పటికే గట్టిగా జవాబు ఇవ్వడం జరిగిందని రాజ్‌నాథ్ అన్నారు. హద్దులు దాటితే సరిహద్దులపై ప్రతిఘటించడమే కాదు అవసరమైతే సరిహద్దుల్లోకి చొరబడి సర్జికల్, ఎయిర్ స్ట్రయిక్స్ చేయగలమని ఇదివరకే పాకిస్తాన్‌కు హెచ్చరించామని ఆయన తెలిపారు. భారత్‌ను అర్థం చేసుకోని మరో దేశం పొరుగున ఉందంటూ చైనా పేరు ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యానించారు.