చైనాకు రాజ్‌నాథ్ పరోక్ష హెచ్చరిక
న్యూఢిల్లీ: తూర్పు లడాఖ్‌లో చైనా సాగిస్తున్న దుశ్చర్యలపై భారత్ సోమవారం ఘాటుగా స్పందించింది. గాల్వన్ ధీరోదాత్తుల త్యాగాలను భారత్ ఎన్నటికీ మరువదని, ప్రతి సవాలుకు గట్టిగా సమాధానమిచ్చే సామర్ధ్యం భారత సాయుధ దళాలకు ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. లడాఖ్ ప్రాంతంలో రెండవ రోజు పర్యటిస్తున్న రాజ్‌నాథ్ ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ పొరుగుదేశాలతో చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవలసి ఉంటుందని, అయితే ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భారత్ సహించబోదని హెచ్చరించారు. దేశం కోసం గాల్వన్ లోయలో ప్రాణత్యాగం చేసిన వీరజవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మరచిపోదని ఆయన చెప్పారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం లడాఖ్‌లో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మిస్తున్న 63 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు.