అతి తక్కువ ఖర్చుతో సాధారణ ప్రజలకు అందివస్తున్న సకల వ్యవస్థలనూ ప్రైవేటుకు కట్టబెట్టి చేతులు దులుపుకునే నిర్వాకానికి కేంద్ర ప్రభుత్వం పట్టపగలు సిగ్గు లేకుండా పాల్పడుతున్నది. కేవలం పార్లమెంటులో బిజెపికి గల ఎదురులేని సంఖ్యాబలం మీద ఆధారపడి ఇందుకు తొందర పడుతున్నది. ఆ నిర్ణయాల్లో ఎన్ని కోట్ల మంది సాధారణ భారతీయుల రక్తకన్నీరు దాగి ఉందో తెలిసి కూడా అందుకు అత్యుత్సాహాన్ని చూపుతున్నది. అధికారం నిర్వహించడమంటే ప్రైవేటు పెట్టుబడిదార్లకు పాద సేవ చేయడమేనని దానికి సంస్కరణల ముసుగు తొడిగేస్తే సరిపోతుందని భావిస్తున్నది. పేదలు అత్యధికంగా ఉన్న మన వంటి దేశాల్లో వారి గొంతులను కోయడమేననే అవగాహన ఎన్‌డిఎ పాలకులలో బొత్తిగా కనిపించడం లేదు. తన పార్టీ పేరులోనే జనతను దాచుకొని కూడా ఈ దూకుడుకు తెగించడం అమాయక బాటసారిని కబళించిన ముసలి పులినే తలపిస్తున్నది. గురువారం నాడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీమా సంస్థల (సవరణ) బిల్లు 2021కి రాజ్యసభ ఆమోదం పొందిన విధానమే అప్రజాస్వామికత దుర్గంధాన్ని చిమ్ముతున్నది.
సమగ్ర చర్చ జరిపించి ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా కాకుండా మూజువాణీ ఓటును ఆశ్రయించి దేశాన్ని ఇప్పటికే అట్టుడికిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలకు ఆమోదం ముద్ర వేయించుకొన్న చేతుల్లోనే ఈ సవరణ బిల్లును గట్టెక్కించడాన్ని పాలకుల పార్లమెంటరీ గూండాయిజం అనడం అతిశయోక్తి కాదు. ఇన్సూరెన్స్ కంపెనీల్లో విదేశీ వాటాలను ఇప్పుడున్న 49 శాతం నుంచి 74 శాతానికి పెంచడానికి ఈ బిల్లును ఉద్దేశించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన దేశ ప్రజలకు మంచి చేయడానికి ఎప్పుడైనా వస్తాయా, ఏ ప్రయోజనం లేకుండా పెట్టుబడిదారు దూర తీరాల్లో తన డబ్బును వెచ్చిస్తాడా, మన ప్రజల మేలు కోసం కాక స్వీయ లాభాల మీద దృష్టితోనే అవి వస్తాయి. ఈ రంగంలోకి అత్యధిక స్థాయి విదేశీ పెట్టుబడులు వచ్చి బీమా సంస్థల ద్రవ్యతను పెంచుతాయని దేశంలో ఇన్సూరెన్స్ సేవలు మరింత మెరుగుపడడానికి తోడ్పడతాయని నిర్మలా సీతారామన్ అన్నారు. 2020 సంవత్సరాంతానికి దేశంలోని బీమా సంస్థల మొత్తం ఆస్తుల విలువ 280 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకున్నది.
వచ్చే మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో ఒక్క జీవిత బీమా సంస్థ సంపద ఏటా 12 నుంచి 15 శాతం పెరగబోతున్నదని అంచనా. ఇంత భారీ సంపద ఆస్తులు ఉన్న సంస్థలను కారుచవకగా విదేశీ పెట్టుబడులకు పాదాక్రాంతం చేస్తారని స్పష్టపడుతున్నది. దేశ మధ్య తరగతి ప్రజలు భవిష్యత్తుపై భరోసా కోసం విశేషంగా ఆధారపడే జీవిత బీమా సంస్థ నిధులను స్టాక్ మార్కెట్‌లో పెట్టడానికి నిర్ణయం తీసుకున్నప్పుడే ఏలిన వారి వ్యూహం వెల్లడైంది. రెండు చేతులు అడ్డంగా పెట్టి దీపాన్ని ఆరకుండా చూసే చిహ్నంతో జీవిత బీమా సంస్థ చిరకాలంగా ఈ దేశ ప్రజల పొదుపు సొమ్ముకు కొండంత అండగా నిలిచింది. అటువంటి సంస్థను స్టాక్ మార్కెట్‌లో పెట్టినప్పుడు అందులోని తమ డబ్బుకి బొత్తిగా భద్రత ఉండదనే భయం దేశ ప్రజల్లో గూడుకట్టుకున్నది. ఇప్పుడు నేరుగా ప్రైవేటు పెట్టుబడులకు దానిని ధారాదత్తం చేస్తే ఏమి జరుగుతుందోననే భయోత్పాతాన్ని ప్రజలు అనుభవిస్తున్నారు. ఇటీవల కొన్ని బ్యాంకులను విలీనం చేసినప్పుడు అవి అంతవరకు నిర్వహిస్తున్న ఆరోగ్య బీమాలను వదులుకున్నాయి.
వాటిని స్వీకరించిన యునైటెడ్ ఇండియా వంటి కంపెనీలు ప్రీమియంలను ఐదారు రెట్లు పెంచేసి వినియోగదార్లకు చుక్కలు చూపిస్తున్నాయి. వారు ఇంతవరకు ఏళ్ల తరబడిగా నడిచిన తమ పాలసీలనే వదిలి పెట్టుకోలేక దుస్థితిని ఎదుర్కొంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీలకు మన బీమా సంస్థలను కారుచవకగా కట్టబెట్టిన తర్వాత ఆధునికీకరణ, యాంత్రీకరణ వంటి జిగేల్ నిర్ణయాలతో అవి ప్రజలను ఎంతగా దోచుకొని ఎన్ని ముప్పుతిప్పులు పెడతాయో ఊహించలేము. ఇన్సూరెన్స్ సవరణ బిల్లుకు ఆదరాబాదరాగా రాజ్యసభ అనుమతి సాధించడానికి తాపత్రయపడవద్దని లోతైన చర్చతో నిర్ణయం తీసుకోడం మంచిదని ప్రతిపక్షాలు ఎంతగా అరిచి గీపెట్టినా బిల్లును స్థాయీ సంఘానికి నివేదించాలని ఎంతగా వేడుకున్నా వినకుండా ఆర్థిక మంత్రి మూజువాణీతో దానిని గట్టెక్కించిన తీరు జుగుప్సాకరంగా ఉన్నది. పెట్టుబడుల ఉపసంహరణకు తాము వ్యతిరేకులం కాదని కాని ఇది పెట్టుబడుల ఉపసంహరణా, ప్రైవేటైజేషనా అని కాంగ్రెస్ సభ్యులు ఆనంద శర్మ అడిగిన ప్రశ్న కు సూటి సమాధానం రాలేదు.
సభ నాలుగు సార్లు వాయిదా పడిన తర్వాత బిల్లు ఆమోదం సాధించుకోడంలోనే దొడ్డిదారి పన్నాగం కనిపిస్తున్నది. రోజురోజుకూ ప్రభుత్వ రంగంలోని సకల ఆస్తులను అమ్మివేసే నడగొండ ప్రక్రియ ఆగాలంటే ప్రజల చైతన్యం అపారంగా పెరగవలసి ఉంది. ప్రతి ఒక్కరూ ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు ఉద్యమకారుల్లా దీక్ష వహించవలసి ఉంది.