భారత 14వ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌గా జగదీప్ ధన్‌ఖడ్ దేశ రాజకీయాల్లో ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించారు. 2022 ఆగస్టు 11న పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆయన పాత్రపై అధికారపక్షం నుంచి అనేక ప్రశంసలు, విపక్షాల నుండి విమర్శలు రెండూ వ్యక్తమవుతున్నాయి. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, భారత రాజకీయం రంగంలో అగ్రశ్రేణి ఉపరాష్ట్రపతి పదవికి చేరుకున్న ఆయన జీవిత ప్రయాణం ప్రశంసనీయమైనది. అయితే రాజ్యసభ ఛైర్మన్‌గా ఆయన ప్రవర్తన, పనితీరు, ముఖ్యంగా పక్షపాత వైఖరి విమర్శకుల పట్ల చూపిన ప్రవర్తన సుదీర్ఘ చర్చలకు దారితీస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలోని కితానా గ్రామంలో 1951 మే 18న జన్మించిన జగదీప్ ధన్‌ఖడ్ సాధారణ రైతుకుటుంబంలో పుట్టి పెద్దయ్యారు.
భౌతిక శాస్త్రంలోనూ, న్యాయశాస్త్రంలో విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆయన తన న్యాయవాద వృత్తి ద్వారా ప్రసిద్ధి చెందారు. సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్‌గా ఆయన పేరు గడించారు. 1989లో జనతాదళ్ తరపున జున్‌ఝును నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరి రాజకీయ జీవితం కొనసాగారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా సేవలందించిన సమయంలో ముఖ్యమంత్రి మమ తా బెనర్జీతో తలెత్తిన ఘర్షణలు ఆయనను బిజెపికి పక్షపాతగా వ్యవహరించారే గానీ, రాజ్యాంగం ప్రకారం నిష్పాక్షికంగా నడచుకోలేదు. ——-రాజ్యసభ ఛైర్మన్‌గా జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి తగినట్లు అన్ని పార్టీలను సమ దృష్టితో కలుపుకుపోతూ సమతుల్యతను ప్రదర్శించాలి. కానీ ఆయన ప్రవర్తన, పక్షపాత ధోరణి, వివాదాస్పద, ఘర్షణ వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి.
ధన్‌ఖడ్‌పై ప్రధాన విమర్శ రాజ్యసభలో ఆయన తీరు చిత్రవిచిత్రంగా ఉంది. ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష సభ్యులను మాటిమాటికి అడ్డుకోవడం, వారి అభిప్రాయాలను పట్టించుకోకపోవడం, ప్రక్రియాపరమైన నియమాలను ఉపయోగించి చర్చలను మధ్యలోనే నిలిపివేయడం వంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇది రాజ్యసభ సమతుల్య స్వభావాన్ని దెబ్బతీస్తుందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. మహిళా సభ్యులను కూడా ఆయన మాటలతో న్యూనతపరచేవారు. జయాబచన్ సభలో ధన్‌ఖడ్ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. మహిళా పార్లమెంటు సభ్యుల పట్ల చులకన భావాన్ని చూపుతూ కామెంట్ చేయడాన్ని అధికార పక్ష మహిళలతో సహా, ప్రతిపక్ష మహిళా నేతలు తీవ్రంగా నొచ్చుకొని స్పందించారు. ఇలా విపక్ష నేతల పట్ల వ్యక్తిగతంగా, దురుసుగా ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలు చాలా సార్లు వివాదాస్పదం అయ్యాయి. చాలా మంది ఆయన మాటలకు బాధపడ్డారు.
పదవికి తగిన హుందాతనాన్ని నిలబెట్టుకోలేకపోయారు అనే విమర్శలు విపక్షాల నుండి వచ్చాయి. ఆయన విమర్శలు అవమానకరంగా ఉంటాయి అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది రాజ్యసభ గౌరవాన్ని తగ్గించడమే కాకుండా పార్లమెంటరీ వ్యవస్థకు తగదని అనేకులు విమర్శిస్తున్నారు. మానసికంగా అసహనంగా ఉంటారు. తరచూ ఆవేశపడిపోతూ ఉంటారు. ప్రతి విషయంలో ఆత్రుత కనిపిస్తుంది. నలుగురి దృష్టిలో పడాలనే వాంఛ బలంగా కనిపిస్తుంది. ధన్‌ఖడ్ వాదనలో తరచూ వివాదాస్పద ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ప్రతి విషయంలో తన వాదమే నెగ్గాలి అనే పంతం కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఆయన ముఖ్యమంత్రి మమతతో వ్యవహరించిన ఘర్షణాత్మక తీరు ఇదే తరహాలో కనిపించింది. ఇప్పుడు అది రాజ్యసభ నిర్వహణలోనూ కొనసాగుతోందని విమర్శల అభిప్రాయం. రాజ్యసభ చైర్మెన్‌గా ఉంటూ కూడా రాజకీయపరంగా, ఆయన బిజెపికి అత్యంత దగ్గరగా ఉండటం ప్రతిపక్షాలను ఆందోళనకు గురిచేస్తోంది.
ఒక రాజ్యాంగ పదవిని అధిష్టించిన నాయకుడు ఇలా పార్టీ విధానాలకు అనుకూలంగా ఉండటం ప్రజాస్వామ్య వ్యవస్థల పటిష్టతను దెబ్బతీయగలదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధన్‌ఖడ్ ప్రవర్తన భారత పార్లమెంటరీ వ్యవస్థలో వస్తున్న మార్పులను హైలైట్ చేస్తోంది. రాజ్యసభ చర్చలు ప్రభుత్వానికి అనుకూలంగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని మరింత బలపరిచేలా ధన్‌ఖడ్ వైఖరి ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జగదీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరించిన తీరు విమర్శలకు గురవుతోంది. ప్రతిపక్షాల అభిప్రాయాలను గౌరవించడం, పార్టీ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడం అవసరం. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యసభకు అవసరమైన గౌరవం, సమతుల్యతను ఆయన పరిరక్షిస్తారా లేదా పార్టీ విధానాలకు మాత్రమే తలవంచుతారా అనేది ఆయన వారసత్వం నిర్ణయిస్తుంది. ఆయన వైఖరికి బాధలు పడిన విపక్షాలు చరిత్రలో మొదటిసారి అవిశ్వాస తీర్మానం కోసం నోటీసు ఇచ్చింది. ప్రజాస్వామ్య విలువలను కాపాడే నాయకులు దేశానికి అత్యంత అవసరం. ధన్‌ఖడ్ వ్యవహారం ఈ విషయంలో నిరంతరం ఆక్షేపణా దృష్టిని ఆకర్షించే అంశంగా మిగులుతుంది.
కోలాహలం
రామ్ కిశోర్
98493 28496