బాయిలర్ల క్రమబద్ధీకరణ, స్టీమ్ బాయిలర్ల పేలుడు ప్రమాదాల నుంచి వ్యక్తుల జీవితానికి, ఆస్తులకు భద్రత, బాయిలర్ల నమోదులో ఏకీకరణకు అవకాశం కల్పించే ఒక బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదముద్ర వేసింది. నూరేళ్ల నాటి బాయిలర్ల చట్టం 1923 రద్దు కోసం ఉద్దేశించినది బాయిలర్ల బిల్లు 2024. ఏడు తప్పులను నేరాల నుంచి తప్పించడం, వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించడం లక్షంగా గల ఈ బిల్లును ఎగువ సభ మూజువాణి వోటుతో ఆమోదించింది.
బాయిలర్ లోపల పనిచేసే వ్యక్తులకు భద్రత ఉండేలా కూడా బిల్లు చూస్తుంది, అర్హులైన, సమర్థులైన వ్యక్తులు బాయిలర్ల మరమ్మతును చేపట్టాలని కూడా బిల్లు నిర్దేశిస్తోంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఇంతకు ముందు చేసిన ప్రకటన ప్రకారం, నేరాలు తప్పించడానికి, వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించడానికి నిబంధనలను బిల్లులో పొందుపరచినందున ఎంఎస్‌ఎంఇ రంగంలోని వారితో సహా బాయిలర్ల వినియోగదారులకు బిల్లు ప్రయోజనకారిగా ఉంటుంది.