బిజూజనతాదళ్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు మమతమొహంతా తన రాజ్యసభ సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల బిజూజనతాదళ్ పార్టీ అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే. మొహంతా రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ జద్దీప్ ధన్‌ఖడ్ ఆమోదించారు. మమత మొహంతా నేరుగా తనకు రాజీనామా పత్రాన్ని అందించారని, సరైన ఫార్మేట్‌లో ఆమె రాజీనామా పత్రం ఉండటంతో ఆమోదించామని,
తక్షణం ఇది అమల్లోకి వచ్చిందని ధన్‌ఖడ్ తెలియజేశారు. మొహంతా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు తెలియజేశాయి. మొహంతా తన రాజీనామా లేఖలో సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించేందుకు అవకాశం ఇచ్చిన ధన్‌ఖడ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. నవీన్ పట్నాయక్‌కు రాసిన రాజీనామా లేఖలో బీజేడీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు వివరించారు. ఒడిశా సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించే అవకాశం కల్పించినందుకు పట్నాయక్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.