న్యూఢిల్లీ : చట్టసభలలో మహిళలకు 33 శాతం కోటా కల్పించే బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. పార్లమెంట్‌లో బిల్లుకు ఆమోదం దక్కడంతో ఇక చట్టసభలలో ‘ ఆమె’ కొత్త కథకు, నయాసిల్‌సిలాకు ఆవిష్కరణం జరిగింది. దాదాపు పది గంటలకు పైగా సుదీర్ఘ చర్చ తరువాత గురువారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఓటింగ్ జరిగింది. ప్రతి సభ్యుడి వద్ద ఉన్న మల్టీ మీడియా డివైజ్ సిస్టమ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. డివిజన్ పద్థతిలో ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఓటింగ్‌లో మొత్తానికి మొత్తం 215 ఓట్లు అనుకూలంగా పడ్డాయి. వ్యతిరేక ఓటు ఒక్కటి పడలేదు . దీనితో బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం దక్కింది.
రాజ్యసభ అధ్యక్షులు , ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ ఆధ్వర్యంలో నిర్వహించారుఅత్యధిక సంఖ్యలో మదదపార్లమెంట్ ఆమోదం పొందుతోన్న ఈ బిల్లు దేశ మహిళ శక్తి ని మరింత ద్విగుణీకృతం చేస్తుందని ప్రధాని మోడీ తమ ప్రసంగంలో తెలిపారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఉభయసభలకు చెందిన 132 మంది సభ్యులు పాల్గొన్నారని , ఇది కొత్త పార్లమెంట్‌కు గర్వకారణం అని మోడీ తెలిపారు. ఈ చర్చల దశలో వ్యక్తం అయిన ప్రతి అంశానికి రాబోయే చరిత్రలో విలువ ఉంటుందన్నారు. బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఈ బిల్లు ఆమోదం పొందడం పట్ల వెంటనే స్పందించారు. ఇది అపూర్వ ఘట్టం అని పేర్కొన్నారు. బిల్లును ఇప్పుడు పార్లమెంట్ ఆమోదం దక్కడంతో రాష్ట్రపతి ఆమోద సంతకానికి అధికారికంగా పంపిస్తారు.