స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత
స్వశక్తితో రూ.5 వేల పెట్టుబడినుంచి 40 వేల కోట్లకు ఎదిగిన వ్యాపారవేత్త
ప్రధాని ప్రభృతుల సంతాపం
ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్‌మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆదివారం కన్నుమూశారు. ముంబయిలో గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 62 ఏళ్లు. కిడ్నీ సంబంధిత సమస్యలు సహా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొద్దివారాల క్రితం ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. కొంత కాలంగా ఆయన వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. ఆయన ఆరోగ్యం తిరిగి క్షీణించడంతో ఆదివారం ఉదయం 6.45 గంటలకు కుటుంబ సభ్యులు ఆయనను బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాకేశ్‌ను ‘బిగ్‌బుల్’, ‘వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తుంటారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. భార్య రేఖ కూడా స్టాక్ వ్యాపారే. దుబాయినుంచి ఆయన సోదరుడు వచ్చిన తర్వాత సాయంత్రం అంత్య క్రియలు జరుగుతాయని తెలుస్తోంది.
రూ.5 వేలతో మొదలుపెట్టి 40 వేల కోట్లకు..
స్వయం శక్తితో కోట్లాది రూపాయల సంపదకు అధిపతిగా మారిన ఝున్‌ఝున్‌వాలా స్టాక్‌మార్కెట్‌లో పట్టిందల్లా బంగారమయింది. డబ్బును డబ్బుతోనే సంపాదించిన ఝున్‌ఝున్‌వాలా 1960జులై 5న హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి రాధేశ్యామ్ ఝున్‌ఝున్‌వాలా ఇన్‌కంట్యాక్స్ అధికారి. విధుల నిమిత్తం ఝున్‌ఝున్‌వాలా కుటుంబం ముంబయిలో స్థిరపడింది. లెక్కల్లో ఆరితేరిన ఝున్‌ఝున్‌వాలా కాలేజి చదివే రోజుల్లో ఆయన తండ్రి తన స్నేహితులతో స్టాక్‌మార్కెట్ గురించి ఎక్కువగా చర్చించేవారు.
దీంతో రాకేశ్‌కు స్టాక్‌మార్కెట్‌పై మక్కువ పెరిగింది. చార్టర్డ్ అకౌంటెంట్ (సిఎ)చదివిన ఆయన ఆ రంగంలోనే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆయన తండ్రి అందుకు అంగీకరించలేదు. అయినా పట్టు వదలకుండా ఆయన స్టాక్‌మార్కెట్లోనే అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో తండ్రి ఆయనకు ఓ సలహా ఇచ్చారు. ప్రతి రోజూ న్యూస్‌పేపర్ చదవాలని, ఎందుకంటే స్టాక్‌మార్కెట్ హెచ్చతగ్గులకు ఆ వార్తలే కారణమని సూచించారు. తండ్రి చెప్పిన ఆ మాటే రూ.5 వేల పెట్టబడితో స్టాక్‌మార్కెట్‌లో అడుగుపెట్టి ప్రస్తుతం 45 వేల కోట్లు సంపాదించేలా చేసిందని, అదే తన విజయ రహస్యమని ఝున్‌ఝున్‌వాలా పలు మీడియా ఇంటర్వూలలో చెప్పారు. 25 ఏళ్ల వయసులో ఓ బంధువు వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ముతో స్టాక్‌మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. మొట్టమొదటిసారిగా రూ.43 వేలు పెట్టి పది వేల టాటా టీ షేర్లను కొనుగోలు చేశారు. కేవలం మూడు నెలల్లోనే ఆ స్టాక్స్ రూ.43నుంచి రూ.143కు పెరగడంతో మూడు రెట్లు లాభం ఆర్జించారు.
ఆ తర్వాత మూడేళ్లలో 20 25 లక్షల రూపాయలు ఆర్జించారు. అలా స్టాక్‌మార్కెట్‌లో అడుగుపెట్టిన ఝున్‌ఝున్‌వాలా అప్రతిహతంగా ఎదిగారు. మెగాస్టార్ అయ్యారు. 2021 మార్చి నాటికి రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్,క్రిల్, లుపిన్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, నజారా టెక్నాలజీస్, ఫెడరల్ బ్యాంక్, డెల్టా కార్పొరేషన్, డిబి రియాలిటీ, టాటా కమ్యూనికేషన్స్ లాంటి 37 కంపెనీల్లో షేర్లు కొనుగోలు చేశారు. ఆ షేర్ల విలువ అక్షరాలా రూ.19,965.3 కోట్లుగా ఉంది. ముఖ్యంగా టైటాన్‌లో పెట్టుబడి ఆయనకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అయితే కొన్ని సార్లు నష్టపోయారు కానీ దాన్ని అనుభవంగానే చూశారు. పలు కంపెనీల బోర్డుల్లో సభ్యులుగా కూడా వ్యవహరించారు. ఇటీవలే ఝున్‌ఝున్‌వాలా ‘ఆకాశ ఎయిర్’ పేరిట విమానయాన రంగంలో కూడా అడుగుపెట్టారు. ఈనెల 7న ప్రారంభమైన తొలి సర్వీసులో ఆయన ముంబయినుంచి అహ్మదాబాద్‌కు ప్రయాణించారు. ఆ కంపెనీలో ఆయనకు 40 శాతం వాటా ఉంది.
భారత ఆర్థిక రంగంపై చెరగని ముద్ర: ఝున్‌ఝున్‌వాలా మృతిపట్ల ప్రధాని సంతాపం
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణంపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు.ప్రధాని మోడీ తన సందేశంలో రాకేశ్ దేశ ప్రగతికి చేసిన కృషిని గుర్తు చేశారు.‘ రాకేశ్ మొండిపట్టదల గల మనిషి. ఆయన జీవితం మొత్తం సరదాతో పాటు మేధస్సుతోను గడిపారు. ఆర్థిక రంగంపై ఆయన చెరగని ముద్ర వేశారు. దేశ పురోగతిని కాంక్షించారు. ఆయన మరణం చాలా విచారకరం. ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులకు పానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’ అని ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, దేవేంద్ర ప్రధాన్, జ్యోతిరాదిత్య సింధియా, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, వేదాంత రిసోర్స్ చైర్మన్ అనిల్ అగర్వాల్ తదితరులు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Rakesh Jhunjhunwala died with Cardiac Arrest