హైదరాబాద్: బిజెపికి ఎవరూ ఓటు వేయవద్దని, బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పిలుపునిచ్చామని సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేష్ తికాయత్ తెలిపారు. సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించినా ఎన్నో సందేహాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో వ్యవసాయ చట్టాల రద్దు అంశంపై పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో మహాధర్నా చేపట్టారు. సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రైతు ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఇందిరాపార్క్ వద్ద గురువారం మహాధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్కెఎం నేత రాకేష్ తికాయత్, ఎఐకెఎస్ నేతలు హన్నన్ మొల్ల, అతుల్ కుమార్ అంజన్, జాగ్తర్ బజ్వా, ఆశిష్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.
అఖిలపక్ష రైతు సంఘాల నేతలు పశ్య పద్మ, తీగల సాగర్, విస్సా కిరణ్కుమార్, వేములపల్లి వెంకటరామయ్య, విమలక్క తదితరులు పాల్గొన్నారు. భాష వేరైనా మనందరి భావన ఒక్కటేనని తికాయత్ తెలిపారు. కేవలం సాగు చట్టాల రద్దు కోసమే తమ పోరాటం కాదన్నారు. మోడి సర్కార్ ప్రజల ప్రభుత్వం కాదని, ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో మోదీ సర్కార్ కొనసాగుతోందని విమర్శించారు. ఆదానీ, అంబానీ ఆదేశాలతోనే కేంద్రం నడుస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో ఏడాది పాటు ఉద్యమం ఇది తొలిసారి అని పేర్కొన్నారు. కార్పొరేట్ల లబ్దికి మోడి ప్రభుత్వం తాపత్రయపడుతోందని విమర్శించారు. సాగుచట్టాల రద్దుపై ఎన్నో అనుమానాలున్నాయన్నారు. ఉద్యమంలో మరణించిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరల చట్టం తీసుకురావాల్సిందేనన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రం కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. కమిటీలో ఎస్కెఎం నేతలు, శాస్త్రవేత్తలను భాగస్వామ్యులను చేయాలన్నారు.
విద్యుత్ సవరణ బిల్లు రద్దుపై ప్రధాని సమాధానమివ్వాలని, విత్తన బిల్లు తీసుకురాకుండా ప్రైవేటు కంపెనీలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా తాము చర్చలకు సిద్ధమని, విస్తృతంగా చర్చిద్దామన్నారు. తమ డిమాండ్లు కేంద్రం అంగీకరిస్తేనే ఇళ్లకు వెళతామని, డిమాండ్లు ఒప్పుకోకపోతే ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఉద్యమంలో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. సాగు చట్టాల రద్దు కోసం రైతాంగం వీరోచిత పోరాటం సాగుతుందని సిపిఎం అనుబంధ ఎఐకెస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్ల అన్నారు. సున్నా డిగ్రీ చలి, వర్షాల్లో సైతం మొక్కవోని ధైర్యంతో ఉద్యమం సాగిందని వెల్లడించారు. డిమాండ్లు సాధించే వరకు ఈ ఉద్యమం ఆగదని, విరమించేది లేదని స్పష్టం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని తేల్చి చెప్పారు.