న్యూఢిల్లీ: వివాదాస్పద మూడు రైతు చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడంపై భారతీయ కిసాన్ యూనియన్(బికెయూ) నాయకుడు రాకేశ్ టికైత్ ప్రతిస్పందించారు. వ్యవసాయ చట్టాల ఉపసంహరణ నిర్ణయాన్ని పార్లమెంటులో ఆమోదించాకే ఆందోళన చేస్తున్న రైతులు తమ ఇళ్లకు తిరిగి వెళతారని ఆయన పునరుద్ఘాటించారు. అంతేకాక ప్రభుత్వం పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పి), ఇతర అంశాలను రైతులతో చర్చించాలని అన్నారు.
రైతులు 2020 నవంబర్ 26 నుంచి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనచేస్తున్నారు. అయితే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని ప్రకటించాక బికెయూ జాతీయ ప్రతినిధి ఈ వివరాలను తన ట్విటర్లో పోస్ట్చేశారు.
“రైతుల ఆందోళనను వెంటనే ఉపసంహరించబోము. వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో ఉపసంహరించేంత వరకు వేచి ఉంటాము. కనీస మద్దతు ధర సహా ఇతర అంశాలపై ప్రభుత్వం రైతులతో చర్చించాలి” అని టికైత్ హిందీలో ట్వీట్ చేశారు. గురునానక్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ “రైతుల ప్రయోజనార్థం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోబోతున్నాం, మేము ఎంత బాగా ప్రయత్నించినప్పటికీ ఓ రైతు వర్గాన్ని కన్విన్స్ చేయలేకపోయాము” అన్నారు.