న్యూఢిల్లీ : ప్రభుత్వ ‘నల్ల సాగు చట్టాల’కు వ్యతిరేకంగా 2020/21లో నిరసన ప్రదర్శనలకు సారథ్యం వహించిన కీలక నేత రాకేష్ తికాయత్ ప్రస్తుతం సాగుతున్న రెండవ ‘ఢిల్లీ చలో’ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఈ ఉద్యమం మంగళవారం ప్రారంభమైంది. పంజాబ్, హర్యానా సరిహద్దులో శంభు వద్ద రైతులపై బాష్పవాయు ప్రయోగం జరిగింది. అది రైతులు, పోలీస్ బలగాల మధ్య సంఘర్షణలకు దారి తీసింది. ‘రైతులకు ప్రభుత్వం సమస్య సృష్టించినట్లయితే చూస్తూ ఊరుకోం’ అని తికాయత్ అధికార బిజెపికి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.
సార్వత్రిక ఎన్నికలకు కొన్ని వారాల ముందు రైతులు ప్రారంభించిన నిరసన ప్రదర్శనల నియంత్రణకు బిజెపి మార్గాలను అన్వేషిస్తోంది. ‘పెక్కు రైతు సంఘాలు ఉన్నాయి. వారికి వేర్వేరు సమస్యలు ఉన్నాయి. ఢిల్లీకి పాదయాత్ర చేస్తున్న రైతులకు ప్రభుత్వం ఏదైనా సమస్యసృష్టించినట్లయితే మేమేమీ వారికి దూరంగా లేము. వారికి దన్నుగా ఉన్నాం’ అని తికాయత్ చెప్పారు. తికాయల్ ఉత్తర ప్రదేశ్ కేంద్రంగా గల భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు)కు చీఫ్. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ స్థాపించిన సంఘం అది. రైతుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 16న ‘భారత్ బంద్’ పాటించాలని రాకేష్ తికాయత్ క్రితం నెల పిలుపు ఇచ్చారు.