Wednesday, January 22, 2025

రెజ్లర్ల ఆందోళనపై నేడు తుది నిర్ణయం

- Advertisement -
- Advertisement -

రెజ్లర్ల ఆందోళనపై నేడు తుది నిర్ణయం
అవసరమైతే రాష్ట్రపతి వద్దకు వెళతాం : రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్
ముజఫర్‌నగర్: రెజ్లర్ల ఆందోళనపై హర్యానాలో శుక్రవారం జరగబోయే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని భారతీయ కిసాన్ సంఘ్ నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. హర్యానాకు చెందిన రైతుల, ఖప్ పంచాయత్‌లు రెజ్లర్లకు మద్దతు ఇస్తున్నాయని, ఈ విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే విషయంలో మాత్రమే నిర్ణయం తీసుకోవలసి ఉందని ఆయన చెప్పారు.ఈ విషయంలో తాము వెనక్కి తగ్గేదే లేదని, రెజ్లర్ల డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు వారికి తమ మద్దతు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ‘అవసరమైతే రాష్ట్రపతి వద్దకు కూడా వెళ్తాం. మేము మీతోనే ఉన్నాం, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో రెజ్లర్ల ఆందోళనకు మద్దతుగా గురువారం జరిగిన భారీ ర్యాలీలో మాట్లాడుతూ తికాయత్ చెప్పారు.

బిజెపి ఎంపి భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లు ప్రభుత్వ వైఖరికి నిరసనగా గత సోమవారం హరిద్వార్‌లో గంగానదిలో తమ పతకాలను విసిరేయడానికి యత్నించిన విషయం తెలిసిందే. అయితే రెజ్లర్లను ఆపిన తికాయత్ కేంద్రానికి అయిదు రోజలు గడువు ఇచ్చి చూద్దామని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే దేశవ్యాప్త ఆందోళన చేపడతామని వారికి నచ్చజెప్పారు. రెజ్లర్ల ఆందోళనకు రైతులు, ఖప్‌లు ఎందుకు మద్దతు ఇస్తున్నాయని అడగ్గా, కుటుం బం ఎంతపెద్దదయితే అంత మంచిదని తికాయత్ అన్నారు.‘కేంద్ర ప్రభుత్వం ఏంచేస్తోందో మీరు అర్థం చేసుకోవాలి. బీహార్‌లో లాలూ ప్రసాద్ కుటంబాన్ని వాళ్లు ముక్కలు చేశారు. ములాయం సింగ్ కుటుంబం విషయంలోనూ అదే జరిగింది, ఇప్పుడు రాజస్థాన్‌లోనూ అదే జరుగుతోంది’ అని తికాయత్ ర్యాలీకి హాజరైన రైతులనుద్దేశించి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News