అమెరికాలోని భారతీయులకు రాకేష్ తికాయత్ పిలుపు
ఘజియాబాద్: ఢిల్లీ సరిహద్దుల్లో గత 10 నెలలుగా సాగుతున్న రైతుల ఆందోళనకు సంఘీభావంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 25న(శనివారం) న్యూయార్క్లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా అమెరికాలో నివసించే భారతీయులు నిరసన తెలియచేయాలని భారతీయ కిసాన్ యూనియన్(బికెయు) నాయకుడు రాకేష్ తికాయత్ శుక్రవారం పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా నరేంద్ర మోడీతో జరగనున్న సమావేశంలో భారతీయ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలో ఇప్పటివరకు 750 మందికి పైగా రైతులు మరణించారని బికెయు జాతీయ అధికార ప్రతినిధి తికాయత్ తెలిపారు.
అయినప్పటికీ కేంద్రం మాత్రం తన చట్టాలను పునఃపరిశీలించడానికి సిద్ధపడడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు నరేంద్ర మోడీ ఈ నెల 25న న్యూయార్క్లో ఉంటారని, ఆ సందర్భంగా అమెరికాలో నివసించే భారతీయులందరూ తమ వాహనాలపై రైతుల జెండాను ఉంచి, రైతులేకుంటే ఆహారం లేదు అన్న నినాదాలతో కూడిన బ్యానర్లు ప్రదర్శించి తమ నిరనన తెలియచేయాలని ఆయన ఒక వీడియో సందేశంలో పిలుపునిచ్చారు. బైడెన్ను ఉద్దేశించి ఒక ట్వీట్ చేస్తూ ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ రైతులు నిరసన కొనసాగిస్తున్నారని, గడచిన 11 నెలలుగా సాగుతున్న నిరసనలలో 700 మందికి పైగా రైతులు మరణించారని, తమను రక్షించడానికి ఈ నల్లచట్టాలను రద్దు చేయాలని, ప్రధాని మోడీతో జరిగే సమావేశంలో ఈ అంశాలపై దృష్టి సారించాలని తికాయత్ విజ్ఞప్తి చేశారు.