Tuesday, November 19, 2024

మళ్లీ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Rallies and public meetings are banned in Telangana until January 2

రాష్ట్రంలో జనవరి 2వరకు ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధం
మాస్క్ తప్పనిసరి, ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జరిమానా
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలను దృష్టిలో ఉంచుకొని విపత్తు నిర్వహణ చట్టం కింద ఆంక్షలు అమలు చేయనుంది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగసభలు నిషేధించారు. కొన్ని నియంత్రణ చర్యలతో జనసమూహం గుమిగూడే కార్యక్రమాలకు అనుమతి ఇవ్వనున్నారు. ఆయా కార్యక్రమాలు జరిగే వేదిక వద్ద భౌతికదూరం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలి. వేదికల ప్రవేశద్వారాల వద్ద థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేసి వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించే విషయమై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఉత్తర్వుల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా విధిస్తారు.

అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్‌పిలు.. తాజా ఉత్తర్వులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలావుండగా, రాష్ట్రంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతోందని.. ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాలు, సంప్రదాయ వేడుకల్లో మాస్కులు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించడం లేదని రవిచందర్, చిక్కుడు ప్రభాకర్, పవన్ కుమార్ తదితర న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో పలు ఉత్సవాల్లో జనం భారీగా గుమిగూడే అవకాశం ఉందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం వేడుకలను నియంత్రించాలని ఆదేశించింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో క్రిస్‌మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకలను నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వేడుకల్లో జనం గుమిగూడకుండా ఆంక్షలు విధిస్తూ రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News