Monday, November 25, 2024

Naatu Naatu: ఐపిఎల్ ఆరంభ వేడుకల్లో చరణ్, తారక్ ‘నాటు నాటు..’ డ్యాన్స్..

- Advertisement -
- Advertisement -

ముంబై : క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)2023 సీజన్‌కు రంగం సిద్ధమైంది. మరో 8 రోజుల్లో ఈ మెగా టి20 లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు తమ సన్నాహకాలను ప్రారంభించగా.. లీగ్ నిర్వహణపై బిసిసిఐ కసరత్తులు ముమ్మరం చేసింది. కొవిడ్ కారణంగా గత మూడు సీజన్లు పరిమిత వేదికల్లో నిర్వహించిన బిసిసిఐ ఈ సారి దేశవ్యాప్తంగా ఆయా ఫ్రాంచైజీల సొంత గ్రౌండ్‌లలో మ్యాచ్‌లు నిర్వహించేందుకు సన్నహాకాలు చేస్తోంది. దీంతో ఐపీఎల్ మ్యాచ్‌లను ఆయా ఫ్రాంచైజీల అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. కొవిడ్ నేపథ్యంలో గత మూడేళ్లు ఐపీఎల్ ఆరంభ వేడుకలను నిర్వహించలేదు. కాకపోతే గతేడాది ముగింపు వేడుకలను జరిపారు.

ఈ వేడుకల సందర్భంగా అతిపెద్ద ఐపిఎల్ జెర్సీని ఆవిష్కరించారు. బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తన డ్యాన్స్‌లతో అభిమానులను అలరించాడు. ఆల్‌టైమ్ హిట్ సాంగ్స్‌కు చిందేసి అభిమానులను ఎంటర్‌టైన్ చేశాడు. తెలుగు హిట్ సాంగ్ నాటు నాటు సాంగ్‌కు సైతం రణ్‌వీర్ సాంగ్ డ్యాన్స్ చేశాడు. అయితే ఈ సారి ఆరంభ వేడుకులనే ఘనంగా నిర్వహించేందుకు బిసిసిఐ ఏర్పాట్లు చేస్తోంది. ఆస్కార్ అవార్డ్ అందుకున్న నాటు నాటు పాటను ఐపిఎల్ 2023 సీజన్ ఆరంభ వేడుకల్లో భాగం చేసేందుకు బిసిసిఐ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ హీరోలు, పాన్ ఇండియా స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో నాటు నాటు డ్యాన్స్ చేయించే ప్రణాళిక రచించినట్లు బిసిసిఐ పెద్దలు తెలిపారు. ఇప్పటికే ఈ విషయమై సదరు హీరోలతో చర్చలు జరిపినట్లు ఓ బిసిసిఐ అధికారి ఒకరు వెల్లడించాడు.

‘ఐపిఎల్ 2023 వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీర్మానించింది. ఆస్కార్ అవార్డు అందుకున్న నాటు నాటు పాటను ప్రారంభ వేడుకల్లో భాగం చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే సదరు హీరోలతో ఈ విషయంపై చర్చలు కూడా పూర్తయ్యాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఐపిఎల్ వేడుకల్లో నాటు నాటు పెర్ఫామెన్స్‌ను చూడవచ్చు’అని సదరు అధికారి తెలిపాడు. ఈ స్టార్ హీరోలతో పాటు సౌతిండియా బ్యూటీస్ రష్మిక మంధన్నా, తమన్నాలతో పాటు మరికొంత మంది మేల్, ఫిమేల్ పాన్ ఇండియా ఆర్టిస్ట్‌లు ఈ వేడుకల్లో భాగమయ్యే అవకాశాలున్నాయి.

కాగా, ఐపిఎల్ 2023 సీజన్ మార్చి 31న ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్‌కు తెరలేవనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇదే మైదానంలో ఆరంభ వేడుకలు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News