Tuesday, January 21, 2025

అందుకే తారక్, చరణ్‌లను తీసుకున్నా

- Advertisement -
- Advertisement -

Ram charan ntr in RRR Movie

ఒక్క టాలీవుడ్‌లోనే కాకుండా దేశంలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌గా వస్తున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రౌద్రం రణం రుధిరం). రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ఇది. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ “ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి రాజమౌళి కాకుండా ఇతర డైరెక్టర్ దర్శకత్వం వహిస్తే.. నేను నటించేవాడిని కాదు. ఇలాంటి కథ జక్కన్నకే సొంతం. ఏ దర్శకుడు ఇలాంటి కథను రాసే సాహసం చేయడు. ఇకపై మల్టీస్టారర్ సినిమాలు వస్తూనే ఉంటాయి. బలమైన కథలు వచ్చి… ఆ దర్శకుడు డీల్ చేయగలడు అనే నమ్మకం కలిగితే తప్పకుండా మల్టీస్టారర్ చేస్తా. ఈ సినిమా చేయడం వల్ల రామ్‌చరణ్‌తో నా స్నేహం ఇంకా బలపడింది.

ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్ర కోసం నా డైరెక్టర్ నుంచే రిఫరెన్స్ తీసుకున్నా. ఆయన ఏం చెబితే అది చేశాను”అని అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ “ఆర్‌ఆర్‌ఆర్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. మేము పోషించనున్న పాత్రలు, వాటి స్వభావాల గురించి తెలుసుకునేందుకు కొన్ని రోజుల సమయాన్ని కేటాయించాం. రాజమౌళికి తాను రాసుకున్న పాత్రలపై పూర్తి అవగాహన ఉంది. ఆయన ఎలా చేయమంటే అలా చేశాము”అని తెలిపారు. రాజమౌళి మాట్లాడుతూ “తారక్, చరణ్‌ల స్టార్‌డమ్ చూసి ఈ సినిమా కోసం వారిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నేను రాసుకున్న కథలో కొమురంభీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలకు వాళ్లు మాత్రమే న్యాయం చేయగలరని భావించా.

అందుకే వాళ్లను తీసుకోవడం జరిగింది. ఇక వయసును దృష్టిలో పెట్టుకొని తారక్‌ని కొమురంభీమ్‌గా, చెర్రీని అల్లూరిగా పెట్టుకోలేదు. అల్లూరి సీతారామరాజు ఎంత అగ్నినైనా గుండెల్లో పెట్టుకునే స్థిత ప్రజ్ఞత కలిగిన వ్యక్తి. అది చరణ్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఆ పాత్ర చరణ్‌కి ఇచ్చా. ఇక కొమరం భీమ్ పాత్ర ఎంతో అమాయకమైన వ్యక్తిది. ఫీలింగ్స్‌ని దాచుకోలేడు. అది తారక్‌లో కనిపిస్తుంది. అందుకే తారక్‌కు భీమ్ పాత్ర ఇచ్చా. అదేవిధంగా నేను రాసుకున్న కథలో సీత పాత్రకి.. ముఖం చూడగానే సాయం చేయాలనే అమాయకత్వం కనిపించాలి. అదే విధంగా నీరు, నిప్పు అనే ఇద్దరు వ్యక్తులను అదుపు చేయగలిగే మనోధైర్యం ఉండాలి. ఇవన్నీ అలియాలో ఉన్నాయి. అందుకే ఆమెను సీత పాత్ర కోసం తీసుకోవడం జరిగింది”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News