ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ’శారీ’. ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు గిరి కృష్ణ కమల్ రూపొందించారు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. శారీ సినిమా ఏప్రిల్ 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. హైదరాబాద్‌లో శారీ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ “-మనం ఎవరితోనైనా డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు పెద్దగా వారితో కనెక్ట్ కాము. కానీ వాట్సాప్ లాంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా మాట్లాడుకున్నప్పుడు మనం వారిని నేరుగా చూడటం లేదు గనుక త్వరగా వారితో కలిసిపోతాం. మన వ్యక్తిగతమైన విషయాలు కూడా చెప్పేస్తుంటాం. శారీ సినిమా నేపథ్యమిదే. ప్రాథమికంగా చూస్తే ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్. నేను ఈ చిత్రానికి మూల కథ రాశాను.
గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహించాడు. ఆరాధ్య చీరకట్టులో చేసిన ఒక రీల్ చూసి ఆమెను కాస్ట్ చేశాం. ఆమె చేసిన పర్ ఫార్మెన్స్ సూపర్బ్ గా అనిపించింది. సత్య ట్రైన్డ్ యాక్టర్. తను బాగా నటించాడు. శారీ సినిమాలో మెసేజ్ ఉంటుందని చెప్పను గానీ ఈ సినిమా చూశాక అమ్మాయిలు జాగ్రత్తపడతారు”అని అన్నారు. డైరెక్టర్ గిరి కృష్ణకమల్ మాట్లాడుతూ “ఈ సినిమాకు నాకు ఇద్దరు గొప్ప యాక్టర్స్ సత్య యాదు, ఆరాధ్య రూపంలో దొరికారు. ఆరాధ్య దేవి ఎలా నటిస్తుందో నాకు తెలియదు. ఆమె రీల్స్ మాత్రమే చూశాను. కానీ అద్భుతంగా నటించింది. సత్య యాదు కొన్ని సీన్స్‌లో ఎదుట ఏ యాక్టర్ లేకుండా తనకు తాను పర్‌ఫార్మ్ చేయాల్సివచ్చేది. అలాంటి సీన్స్ లో సత్య బాగా నటించాడు”అని తెలిపారు. హీరోయిన్ ఆరాధ్య దేవి మాట్లాడుతూ “శారీ సినిమా నాకొక డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ పాత్రలో నటించేందుకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు డైరెక్టర్ కృష్ణకమల్. శారీ సినిమా ట్రైలర్ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో సత్య యాదు పాల్గొన్నారు.