Wednesday, January 22, 2025

ఆ వాదనతో నేను ఏకీభవించను

- Advertisement -
- Advertisement -

Ram Gopal varma met Minister Perni Nani

 

ఏపిలో సినిమా టికెట్ ధరల తగ్గింపు వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటోందని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం ఏపి మంత్రి పేర్ని నానితో ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి పేర్ని నానితో చర్చలు సంతృప్తికరంగా జరిగాయన్నారు. మంత్రితో ఐదు ముఖ్యమైన అంశాలపై చర్చించామని, ప్రధానంగా ఏపిలో టికెట్ల రేట్ల తగ్గింపును ముందుగా ప్రస్తావించానని చెప్పుకొచ్చారు. థియేటర్ల మూసివేతపై ఎలాంటి చర్చా జరగలేదని ఆర్జీవి స్పష్టం చేశారు. టికెట్ ధరల కేటాయింపుపై ఎవరికీ అధికారం ఉండకూడదని అన్నారు. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ “మంత్రి పేర్ని నానితో జరిగిన సమావేశంలో ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించా. సినీ రంగంతో నాకున్న 30 ఏళ్ల అనుభవంతో ఎక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చా. ఆయన కూడా కొన్ని విషయాలను నా దృష్టికి తీసుకొచ్చారు. వాటిని మా సినీరంగానికి చెందిన వారితో చర్చిస్తా. ఇదొక పద్ధతి ప్రకారం చేస్తాం. అందరికీ ఒక పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నా.

టికెట్ రేట్లు తగ్గిస్తే ఇండస్ట్రీకి చాలా నష్టం వస్తుందని ఆయనకు వివరించా. సినీ నిర్మాతగా నా అభిప్రాయం చెప్పా. నా వాదన వినిపించేందుకు మాత్రమే ఇక్కడకు వచ్చా. నేను ఎలాంటి డిమాండ్లు ఆయన ఎదుట పెట్టలేదు. తుది నిర్ణయం అనేది ప్రభుత్వం తీసుకుంటుంది.రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఏపి ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను తగ్గించిందనే వాదనతో నేను ఏకీభవించను. అయితే ప్రభుత్వ నిర్ణయం స్టార్లందరి పైనా, అన్ని సినిమాలపైనా ప్రభావం చూపుతోంది. కేవలం పవన్ కల్యాణ్, బాలకృష్ణను టార్గెట్ చేయడానికి ఏపి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకోవడం లేదు. టికెట్ రేట్ల తగ్గింపు విషయంలో నేను అడిగిన ప్రశ్నలకు విపులంగా ఉదాహరణలు చెప్పి అన్నీ వివరించా. కేవలం ఈ ఒక్క చర్చతోనే టికెట్ రేట్ల తగ్గింపు అంశం ముగిసిపోదు.

ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే నేను ఒక్కడినే కాదు. వందల మంది ఉన్నారు. వాళ్లందరి అభిప్రాయాలను కూడా ఏపి ప్రభుత్వం తీసుకుంటుంది. నేను సినిమా ఇండస్ట్రీ తరపున రాలేదు. ఒక సినిమా నిర్మాతగా మాత్రమే ఇక్కడ చర్చించడానికి వచ్చా. ఎవరైతే సినిమా తీశారో వాళ్లే టికెట్ రేటు నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలి. పరిష్కారం అనేది సినిమా ఇండస్ట్రీ, ఏపి ప్రభుత్వం ఇద్దరి పైనా ఉంది. తప్పుడు కలెక్షన్లు, పన్ను ఎగవేతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. తాజా చర్చలతో నూటికి నూరుశాతం సంతృప్తితో ఉన్నా”అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News