అయోధ్య రామ్ మందిర్ ప్రధాన అర్చకుని వినతి
లక్నో : తిరుపతి ఆలయం లడ్డుల కల్తీ ఆరోపణలపై వివాదం ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య, ప్రయాగ్‌రాజ్, మథుర నుంచి స్పందనలకు దారి తీసింది. ప్రసాదం తయారీ, పంపిణీలో సంస్కరణలకు అక్కడి అర్చకులు పిలుపు ఇస్తున్నారు. బాహ్య సంస్థలు తయారు చేసిన ప్రసాదంపై ‘పూర్తి నిషేధం’ విధించాలని అయోధ్యలో రామ్ జన్మభూమి ఆలయం ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. ఆలయం నైవేద్యాల్లో ఉపయోగిస్తున్న నెయ్యి స్వచ్ఛతపై ఆయన ఆందోళన వ్యక్తంచేసి, ‘అన్ని ప్రసాదాలను ఆలయ అర్చకుల పర్యవేక్షణలో సిద్ధం చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు.
‘తిరుపతి బాలాజీ ప్రసాదంలో కొవ్వు, మాంసం ఉపయోగించారనే ఆరోపణపై వివాదం దేశం అంతటా ముదురుతోంది’ అని దాస్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న నూనె, నెయ్యి నాణ్యతను కఠినంగా పరీక్షించవలసిన ఆవశ్యకత ఉందని ఆయన నొక్కి చెప్పారు. నైవేద్యాల్లో అనుచిత పదార్థాలు కలిపి ఆలయాలను అపవిత్రం చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతోందని దాస్ ఆరోపించారు. ప్రసాదాలను పూర్వపు సరళిలో తిరిగి తయారు చేయాలన్న నిర్ణయాన్ని మథురలో ధర్మ రక్ష సంఘ్ ప్రకటించింది. వాణిజ్య స్థాయిలో తయారు చేసిన మిఠాయిలకు బదులు పండ్లు, పూలు. ఇతర సహజ ముడివస్తువులతో తయారుచేసిన ప్రసాదాలను ఉపయోగించాలని సంఘ్ కోరింది. ఇక ‘సంగమ్ నగరం’ ప్రయాగ్‌రాజ్‌లో అలోప్ శాంకరీ దేవి, బడే హనుమాన్, మంకమేశ్వర్ సహా పలు ఆలయాలు ప్రసాదాలుగా మిఠాయిలు, ప్రాసెస్ చేసిన పదార్థాలను భక్తులు తీసుకురావడాన్ని నిషేధించాయి.