అయోధ్య: ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో బుధవారం సాయంత్రం శ్రీరామ జన్మభూమి ఆలయం ప్రాంగణం చుట్టూ రామ్ లల్లా వెండి విగ్రహంతో ఊరేగింపు జరిగింది. అయితే జనవరి 22న ఆలయంలోని గర్భగుడిలో ప్రతిష్టించే విగ్రహం ఇది కాదు. గులావీలు, చామంతుల మాలలు ధరించిన రామ్ లల్లా వెండి విగ్రహాన్ని వివిధ రకాల పూలతో అలంకరించిన పల్లకిలో ఆలయం చుట్టూ ఆలయ పూజారులు ఊరేగించారు. శిరస్సుపై కలశం ఉంచుకుని ప్రధానార్చకుడు పల్లకి ముందు నడవగా పూజారులు, శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు సభ్యులతోపాటు భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు. అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా వారం రోజులపాటు జరుగుతున్న కార్యక్రమాలలో నేడు రెండవ రోజు కార్యక్రమంగా శ్రీరాముడి వెండి విగ్రహ ఊరేగింపును నిర్వహించారు.
జనవరి 21వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. నేటి కార్యక్రమంలో భాగంగా కలశ పూజ జరిగింది. శ్రీరామ జన్మభూమి ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా సతీసమేతంగా సరయూ నది ఒడ్డున కలశ పూజను నిర్వహించారు. నదిలోని నీటితో నింపిన కలశాలను ఆలయ ప్రాంగణానికి తీసుకువచ్చి అక్కడ పూజలు నిర్వహించారు. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు ఆలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంటకు ముగియనున్నది. కాగా.. మంగళవారం ఆలయంలో పంచగవ్యప్రశన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాలు, గోమూత్రం, పేడ, నెయ్యి, పెరుగుతో తయారుచేసిన పంచగవ్యతో విష్ణుమూర్తికి అభిషేకం జరిగింది.