అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జోరందుకున్నాయి. రామ్ లల్లా విగ్రహం బుధవారంనాడు అయోధ్యకు చేరుకుంటుంది. మేళతాళాల మధ్య ఊరేగింపుగా రాములవారి విగ్రహం అయోధ్యకు వస్తుంది. విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించిన పనులు మంగళవారంనుంచి మొదలయ్యాయి. రామమందిరం గురించి, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి తెలుసుకోవాలనుకునే భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘దివ్య్ అయోధ్య’ యాప్ రూపొందించింది. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, ఆ వివరాలన్నీ తెలుసుకోవచ్చు.
రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం రూపొందించిన ఆహ్వాన పత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించబోయే బాలరాముడి విగ్రహ రూపాన్ని ఆహ్వాన పత్రికలపై ముద్రించారు. అయోధ్యకు వచ్చే అతిథుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. దీనికి నిషాద్ రాజ్ అతిథిగృహం అని నామకరణం చేసింది. ఇందులో వేసిన గుడారాల్లో అతిథులు బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు.