Saturday, November 2, 2024

ధర్మబద్ధమా, మోడీ బద్ధమా!

- Advertisement -
- Advertisement -

‘జనవరి 22 వ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట మహావైభవోపేతంగా జరగబోతోంది. దీనికి సంబంధించి అనేక రాజకీయ, ఆధ్యాత్మిక వాద, వివాదాలు భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. రామ మందిర నిర్మాణం, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఒక ఆధ్యాత్మిక, భక్తికి సంబంధించిన కార్యక్రమం. దీనిలో రాజకీయ ప్రస్తావనలు చోటు చేసుకోవడం శోచనీయం. ఈ కార్యక్రమానికి ఒకరు వెళ్ళాలా, అక్కర లేదా అనేది వారివారి స్వవిషయం. దీని కోసం ఒకరు ప్రత్యేకంగా ఎవరినీ ఆహ్వానించవలసిన అవసరం లేదు. ఎవరికి వీలైనప్పడు వారు మందిరానికి వెళతారు.

పలానా సమయంలో రావాలి, పలానా రోజోనే రావాలి అని ఎవరూ, ఎవరినీ శాసించలేరు. ఈ కార్యక్రమానికి సిపిఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ శ్రీరామునిపై వ్యతిరేకతతో రావడం లేదని రాజకీయ దుష్ప్రచారం చేయడం ఎందుకు? అయోధ్యలో సుప్రీం కోర్టు తీర్పు వచ్చినప్పటి నుండి నేటి ప్రాణప్రతిష్ట కార్యక్రమం వరకూ మొత్తం ప్రధాని మోడీ అధికార పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నది. ఇప్పుడు వారు రావడం లేదు, వీరు రావడం లేదు అనే చర్చలెందుకు? ‘భగవంతుణ్ణి దర్శించు కోవాలీ అంటే కూడా దైవానుగ్రహం ఉండాలని’ పెద్దలంటారు. ‘శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదని’ లోకోక్తి.

మత సంబంధిత కార్యక్రమాలు సాధారణంగా ఆధ్యాత్మిక వేత్తలు, మత సంబంధిత గురువులు, పీఠాధిపతుల పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రభుత్వాలు లాంఛనంగా ఆయా కార్యక్రమాల, ఉత్సవాల సమయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా పారిశుధ్య కార్యక్రమాలు, శాంతిభద్రతల పర్యవేక్షణ, భక్తులకు తోపులాటల వల్ల ఇబ్బందికలగకుండా చూస్తాయి. అవి కూడా సంబంధిత ఆలయం ఉత్సవ కమిటీ కోరిక మేరెకే జోక్యం చేసుకుంటాయి. మత, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగడం ఒక రకంగా లౌకిక రాజ్యాంగానికి విరుద్ధం. ఈ కార్యక్రమంలో మోడీ వ్యక్తిగత ప్రతిష్టను పెంచడానికి, రానున్న రెండు మాసాల్లో వచ్చే ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ హడావిడి జరుగుతుంది అనే విమర్శలు నలుమూలల నుండి వస్తున్నాయి.

దైవకార్యాన్ని ఎవరైనా చేపట్టవచ్చు. కానీ ఇక్కడ కార్యక్రమాలు మాత్రం బిజెపి, సంఘ్ పరివార్ కార్యకర్తల తంతుగా మారింది. దీనికి మొత్తం మూలకారకుడు ప్రధాన మంత్రి మోడీ మాత్రమే అన్నట్టు పెద్దఎత్తున ప్రచారార్భాటం జరుగుతుందనే విమర్శ మీడియాలో ప్రధానంగా వినవస్తున్నాయి. ఈ ప్రచారం ఎంత వరకు దారి తీసిందీ అంటే 1990లో రథయాత్రను ప్రారంభించి అయోధ్యను రామజన్మ భూమిగా దేశ రాజకీయాలలోకి తీసుకు వెళ్ళిన ఆనాటి బిజెపి అగ్రనేత అద్వానీ, మురళీ మనోహర్ జోషిలనే ఆ ప్రధాన భూమిక నుండి కనుమరుగు చేసేంత వరకు వెళ్ళాయనీ అనేక విమర్శలు హోరెత్తుతున్నాయి. అయితే ఈ విమర్శల దాడి నుంచి తప్పించుకోవడానికి ఆయనను మొదట రావద్దని చెప్పిన పెద్ద మనుషులే ఆయనను రప్పించి ఈ మహత్కార్యానికి ఆ శ్రీరామ చంద్రుడే మోడీని ఎన్నుకున్నారని’ ఆయనతోనే చెప్పించేంత వరకు వార్తలు వినవస్తున్నాయి. రానున్న రోజుల్లోనూ ఈ విమర్శలు, ప్రతివిమర్శలు ఎంతదూరం వెళతాయో వేచిచూడాలి.

ప్రస్తుతం ఈ ఉత్సవం కన్నుల పండుగగా విజయవంతం కావడానికి ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు దేశ, విదేశాలలో నలుమూలలా అక్షింతలు పంచుతూ, ముఖ్యమైన వారికి అందమైన ఆహ్వాన పత్రికలు పంపిణీ చేస్తున్నారు. ఆహ్వానం అందుకున్న ప్రముఖులు కొందరు అనుకూలంగా మరి కొందరు ప్రతికూలంగా స్పందిస్తున్నారు. మతాన్ని, రాజకీయాలను వేరువేరుగా చూడాలి ఆ రెండింటినీ ఒకే గాటన కట్టకూడదని భారత రాజ్యాంగ సూత్రాలు నిర్దేశించాయి. కమ్యూనిస్టు పార్టీలు మొదటి నుండి ఇదే నియమాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నాయి. కానీ, కాంగ్రెస్, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, వైసిపి, ఆప్ వంటి వివిధ పార్టీలు, వివిధ సమయాల్లో, వివిధ రకాలుగా భిన్న వ్యాఖ్యలు చేస్తున్నాయి. వారి నాయకులకూ, పార్టీ అనుచరుల మధ్య కూడా ఏకాభిప్రాయం లేదు. ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు. అలాగే ఆ పార్టీల నాయకుల పైన, వ్యక్తుల పైన సంఘ్ పరివార్ ప్రతిస్పందనలు కూడా విభిన్నంగానే వుంటున్నాయి.

కాంగ్రెస్ పైన, సైద్ధాంతికంగా పరస్పరం ప్రత్యర్థులైన కమ్యూనిస్టుల పైనే తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. కొందరు కాంగ్రెస్ నేతల మాటలు విభిన్నంగా వుంటున్నాయి. ఏదో సాకులు చెప్పినట్లు బిజెపి కార్యక్రమంలా జరుగుతున్నందు వల్లే తాము వెళ్లడం లేదని చెప్పారు. వారిలో కొందరు అసలు అయోధ్య స్థలం తాళాలు తీసిందే తాము గనక ఈ ఘనత తమకే దక్కాలని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. కొందరు మేమంతా హిందువులమే అందుకు మీ అనుమతి, పెత్తనం ఏమిటన్నది మరో ప్రశ్న వినిపిస్తున్నది. మమతా బెనర్జీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరికొందరు కాంగ్రెస్ చోటా నాయకులు ఈ ఉత్సవంలో పాల్గొనకపోవడం పెద్ద తప్పు చేసిందని కామెంట్ చేశారు. నెహ్రూ తరువాత లౌకిక వాదాన్ని అదే స్థాయిలో నిష్ఠతో తదనంతర కాంగ్రెస్ నాయకులు కొనసాగించడంలో తప్పటడుగులు వేశారు. అందుకే నేడు ‘కాంగ్రెస్ మతవాదీ కాదూ, లౌకికవాదీ కాదు’ అనే నిందను మోస్తూ రెంటికీ చెడింది. ఇక ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలలో నిక్కచ్చిగా తాము లౌకిక వాదానికి కట్టుబడి ఉన్నామని చెప్పుకోలేని దీనస్థితికి నెట్టబడ్డాయి. తమ స్వార్ధపూరిత అవసరాల కోసం ఒక స్థిరమైన వైఖరిని అనుసరించలేకపోయాయి. అందుకే తాము తప్ప అందరూ హిందూ వ్యతిరేకులే అన్నట్టు బిజెపి చెప్పే వాదానికి బలం చేకూరింది.

రాజకీయ పార్టీలు, వాటి నాయకులు ఏం మాట్లాడినా ప్రజలు పెద్దగా వాటిని పట్టించుకోరు. కానీ సనాతన హిందూ ధర్మపరిరక్షకులు ఆ ధర్మానికే ప్రతీకలుగా పరిగణించబడే నలుగురు శంకర పీఠాల మహాచార్యులు (ముక్తేశ్వరానంద, నిశ్చలానంద సరస్వతి, సదానంద సరస్వతి, భారతీ తీర్థ) ఈ మహోత్సవానికి రాలేమని ప్రకటించారు. అందుకు వారు చెప్పే కారణాలు కేవలం శాస్త్రబద్ధమైనవి, సంప్రదాయపరమైనవి. ఆలయం సంపూర్ణంగా నిర్మాణం కాలేదనీ పూర్తి కావడానికి మరో సంవత్సర కాలం పడుతుంది. ఈ స్థితిలో రామమందిర ప్రాణ ప్రతిష్టకు శాస్త్రబద్ధంగా ఆస్కారం లేదని వారు హితబోధ చేస్తున్నారు. అందువల్ల తాము అయోధ్యకు రాలేము అని ప్రకటించారు.

మరి కొందరు సాధువులు, యోగీశ్వరులు అసలు మసీదు శిథిలాల మీద ఆలయ నిర్మాణం చేయడం శాస్త్ర విరుద్ధమనీ ప్రకటించారు. మరి కొందరు పూజాదికాలు మోడీ లాంటి రాజకీయవేత్త నిర్వహించడానికి అర్హత లేదనీ తమతమ కోణాల్లో అభ్యంతరాలు ప్రకటించారు. మరి కొందరు రాబోయే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందటాని శాస్త్రబద్ధంకాని, జోతిష్య శాస్త్రం, పంచాంగం ప్రకారం మంచి ముహూర్తాలు కూడా లేని తేదీలను ఎంచుకోవడం కూడా శాస్త్రబద్ధం కాదని వారు వాదిస్తున్నారు. పూర్తిగా రాజకీయ, ఎన్నికల అవసరాలే మోడీని ఈ కార్యక్రమాన్ని వేగంగా నిర్వహించడానికి పురికొల్పుతున్నాయి. అంతేకానీ ఆయనకు ధర్మాధర్మాలతో పనిలేదు అని కొందరు విమర్శకులు అంటున్నారు.

తమాషా ఏమంటే ఇప్పటి వరకు ప్రతిపక్షాలపై ఇంతగా విరుచుకుపడిన బిజెపి, సంఘ్ పరివార్ సంస్థలు, దాని ప్రతినిధులు ఈ ధర్మ సంరక్షకులైన శంకర పీఠం అధిపతుల అభిప్రాయాల విషయంలో శుక్రవారం వరకు అసలు ఆ వూసే ఎత్తలేదు. స్వాముల మాటలు, వారి అభ్యంతరాలు తాము విననట్టే నటించారు. కానీ శనివారం 13వ తేదీన అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్టకు తాము హాజరుకాబోమని ఆ కార్యక్రమం పూర్తిగా రాజకీయ కార్యక్రమాల్లో ఉందని నలుగురు శంకరాచార్యులు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నారాయణ రాణి విమర్శలు గుప్పించారు. అసలు హిందూ మతానికి శంకరాచార్యులు చేసిన సేవ ఏమిటి? అని ప్రశ్నించారు ప్రధాని మోడీని, బిజెపిని రాజకీయ దృష్టితో చూస్తున్నారన్నారు. అయితే వెంటనే నారాయణ రాణీ వ్యాఖ్యలపై ఆదివారం దేశంలో నలుమూలల నుండి విమర్శలు వెల్లువెత్తాయి.

ఆయన్ను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని, దీనిపై బిజెపి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని శివసేన, యుపిటి డిమాండ్ చేసింది. నారాయణ రాణి కేంద్ర మంత్రిగా మొత్తం హిందూ మతాన్ని అవమానపరిచారని అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై బిజెపి బాధ్యత వహించాలని శరద్ పవర్, ఎన్‌సిపికి చెందిన ఎంపి సుప్రియ సురే కోరారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు ముంబైలోని నారాయణ పార్టీ కార్యాలయం ఎదుట కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అందుకే రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య భారత పరిణామక్రమంలో అయోధ్య రామమందిర ఘట్టాన్ని చాలా నిశితంగా, విమర్శనాత్మకంగా పరిశీలించవలసి వుంటుంది. లౌకిక భావాలు గల వారెవరైనా దీన్ని యథాలాపంగా భావిస్తే పొరబాటవుతుంది. హిందూమతం వేరు, హిందూత్వ రాజకీయం వేరు. ఆ రాజకీయం రాజ్యం చేయడం వేరనే స్పష్టత కోల్పోకూడదు. నడుస్తున్నది మోడీ రాజ్యమే గానీ, రామరాజ్యం కాదని అందరూ గుర్తించక తప్పదు.

డా. కోలాహలం
రామ్ కిశోర్
9849328496

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News