భక్తుల సౌకర్యాల కోసం అయోధ్యలో 1.15 లక్షల చ.అ. స్థలం కొనుగోలు
రూ. 8 కోట్లు చెల్లించిన తీర్థ క్షేత్ర ట్రస్టు
అయోధ్య: భక్తులకు, భద్రతా సిబ్బందికి వసతి సౌకర్యాలతోపాటు ట్రస్టు కార్యకలాపాల కోసం అయోధ్యలోని రామజన్మభూమి ఆలయ ప్రాంగణానికి సుమారు 2-3 కిలోమీటర్ల దూరంలో దాదాపు 1.5 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కొనుగోలు చేసినట్లు ట్రస్టు శనివారం తెలిపింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని బస్తీ జిల్లా వాసి హరీష్ కుమార్ పాఠక్ నుంచి రామ్ కోట్, తెహ్రీ బజార్ ప్రాంతాలలో రెండు ఖాళీ స్థలాలను గత వారం కొనుగోలు చేసినట్లు ట్రస్టు సభ్యుడు అనీల్ మిశ్రా తెలియచేశారు. చదరపు గజం రూ. 690 చొప్పున ఈ స్థలాలను కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. రెండు ప్లాట్ల కోసం భూ యజమానికి రూ. 8 కోట్లు చెల్లించామని ఆయన పేర్కొన్నారు.
ఆలయ భూమి విస్తరణ కోసం రామ జన్మభూమి ప్రాంగణానికి ఆనుకుని ఉన్న ఆస్తుల సర్వే జరుగుతోందని, ఆ ఆస్తుల యజమానులను గుర్తించే ప్రక్రియను చేపట్టామని ఆయన తెలిపారు. ఈ ఆస్తులలో కొన్ని ముస్లిం కుటుంబాలకు చెందిన ఇళ్లు, మసీదులు కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. పరస్పర అంగీకారం, చర్చలతో రామ జన్మభూమి ప్రాంగణ విస్తరణ జరుగుతుందని ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. వారు కోరిన మేరకు డబ్బు చెల్లించి లేదా ప్రత్యామ్నాయ స్థలాన్ని అందచేసి భూమి కొనుగోలు చేపడతామని ఆయన చెప్పారు. ప్రస్తుతం 70 ఎకరాలు ఉన్న రామజన్మభూమి ఆలయ ప్రాంగణ విస్తీర్ణాన్ని 107 ఎకరాలకు విస్తరించాలన్నది ట్రస్టు ప్రణాళిక. ఇందులో భాగంగా మార్చి మొదటివారంలో ఆలయ ప్రాంగణానికి అనుకుని ఉన్న 7.285 చదరపు అడుగుల స్థలాన్ని ట్రస్టు కొనుగోలు చేసింది.