‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలోని అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయిన ఉన్నతస్థాయి కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. గురువారం ఉదయం కోవింద్ సహా కమిటీ సభ్యులు రాష్ట్రపతిభవన్‌కు వెళ్లారు. జమిలి ఎన్నికలపై 18,629 పేజీల నివేదికను సమరించారు. దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది.
ఏకకాలంలో ఓటు వేయడం దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడంలో దోహదపడుతుందని కమిటీ తన నివేదికలో అభిప్రాయపడింది. ఒకేసారి ఐక్యంగా ఓటు వేయడం అనేది అభివృద్ధి ప్రక్రియను , సామాజిక ఐక్యతను ప్రోతసహిస్తుంది. ప్రజాస్వామ్య పునాదిని మరింత బలోపేతం చేస్తుంది. ఏకకాలంలో ఓటింగ్ జరగడం వల్ల పారదర్శకత, సౌలభ్యం, ఓటరు విశ్వాసం గణనీయంగా పెరుగుతుందని కోవింద్ కమిటీ అభిప్రాయపడింది.