Tuesday, December 17, 2024

కేంద్రం ముందు మరో సవాలు

- Advertisement -
- Advertisement -

దేశంలోని లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికల జరపాలన్న ప్రతిపాదనపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన 15 పార్టీలతో పాటు ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకున్న మాజీ అధికారులు, సీనియర్ రాజకీయవేత్తలు ఈ అంశంపై, ఆచరణపై అనేకానేక సందేహాలు వ్యక్తం చేస్తూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికను అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్రం నెత్తిన పడింది. 2029 నుంచే జమిలి ఎన్నికల విధానం అమల్లోకి రావాలని కోవింద్ కమిటీ తన నివేదికను రాష్ట్రపతి ముర్ముకు అందజేసిన తర్వాత దీని అమలు అనేక సవాళ్ళతో కూడుకున్నదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దేశ వ్యాప్తంగా దీనిపై భిన్నకోణాల్లో చర్చలు జరుగుతున్నాయి. అసలు ఎన్నికలే లేకుండా ఏక పార్టీ పాలన కోసమే ఈ ప్రతిపాదన ఎన్నికల ముందు తీసుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించగా, మజ్లిస్ కూడా కోవింద్‌ను ముందు పెట్టి బిజెపి తన ప్రతిపాదనను అమలు చేయించడం ద్వారా తన రాజకీయ ప్రయోజనాలు నెరవేరేలా కుట్ర చేస్తున్నదని ఆరోపించింది.

జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ దేశ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి, వివిధ రాజకీయ పార్టీలు, వివిధ వర్గాలు, మేధావి వర్గాలతో చర్చించి రూపొందించిన 18,626 పేజీలతో కూడిన తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. లోక్‌సభ, రాష్ట్ర శాసన సభలు, స్థానిక సంస్థలకు జమిలిగా ఎన్నికలు నిర్వహించడంలోని సాధ్యాసాధ్యాలను, అందుకు చేపట్టవలసిన చర్యలను, రాజ్యాంగ సవరణలను తన నివేదికలో కమిటీ సిఫార్సు చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపోమాపో వెలువడనున్న తరుణంలో కోవింద్ కమిటీ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించినందున 2029 లోక్‌సభ ఎన్నికలకు ఇది వర్తించే అవకాశం ఉంది. జమిలి ఎన్నికలపై ఇప్పటికే వివిధ రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాలను కమిటీకి తెలియచేశాయి. 62 రాజకీయ పార్టీలను కోవింద్ కమిటీ సంప్రదించగా వీటిలో 47 పార్టీలు మాత్రమే స్పందించాయి. అందులో 32 పార్టీలు జమిలి ఎన్నికలను సమర్థించగా 15 పార్టీలు వ్యతిరేకించాయి.

కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, సిపిఎం వంటి జాతీయ పార్టీలు జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకించాయి. రాష్ట్ర పార్టీలలో తృణమూల్ కాంగ్రెస్, మజ్లిస్, సిపిఐ, డిఎంకె, నాగా పీపుల్స్ ఫ్రంట్, సమాజ్‌వాది పార్టీ తదితర పార్టీలు జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకించాయి. బిజెపితోపాటు బిజూ జనతాదళ్, శివసేన, జనతాదళ్ (యు), ఎఐఎడిఎంకె, శిరోమణి అకాలీదళ్ మొదలైన పార్టీలు ఈ ప్రతిపాదనకు మద్దతిచ్చాయి.అయితే భారత రాష్ట్ర సమితి, ఐయుఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, జనతాదళ్ (ఎస్), జెఎంఎం, ఎన్‌సిపి, ఆర్‌జెడి, ఆర్‌ఎస్‌పి, తెలుగు దేశం పార్టీ, వైఎస్‌ఆర్‌సిపి తదితర పార్టీలు జమిలి ఎన్నికల ప్రతిపాదనపై తమ స్పందన తెలియచేయలేదు. ఒక దేశం, ఒకే ఎన్నికల వల్ల దేశానికి ఒనగూరే లాభం ఏమిటన్న ప్రశ్నకు ప్రభుత్వ ధనం ఆదా అవుతుందన్న సమాధానం వస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల కోసం రూ. 60,000 కోట్ల వ్యయం అయినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఎన్నికల కోసం ఎన్నికల సంఘం చేసిన ఖర్చుతో పాటు రాజకీయ పార్టీలు ఖర్చు చేసిన ధనం కూడా ఇమిడి ఉంది.

జమిలి ఎన్నికల వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందని, అవినీతి తగ్గిపోవడంతో పాటు సమయం, శ్రమ ఆదా అవుతాయన్న వాదన కూడా ప్రభుత్వం వినిపిస్తోంది. అయితే రాష్ట్ర అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయన్న వాదనను కొందరు ముందుకు తెస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో స్థానిక అంశాలు, లోక్‌సభ ఎన్నికలలో జాతీయ అంశాలు తెరపైకి వస్తాయన్నది వారి వాదన. జమిలి ఎన్నికల వల్ల స్థానిక అంశాలను బలంగా లేవనెత్తలేమని ప్రాంతీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్నికల వ్యయంలో కాని, ఎన్నికల వ్యూహంలో కాని జాతీయ పార్టీలతో పోటీ పడలేమని ప్రాంతీయ పార్టీల భావన. అంతేగాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే ఉండాలన్న అభిప్రాయంతో ఓటరు ఒకే పార్టీకి ఓటు వేసే అవకాశం కూడా లేకపోలేదని, దీని వల్ల జాతీయ పార్టీలు లాభపడవచ్చునేమో కాని ప్రాంతీయ పార్టీలు నష్టపోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయమూ వినపడుతోంది. రాజ్యాంగంతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి, మరి కొన్ని చట్టాలకు సవరణలు చేయవలసి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తుందో లేదో వేచి చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News