Monday, December 23, 2024

విధ్వంసం.. హిందుత్వానికే కళంకం

- Advertisement -
- Advertisement -

హిందుత్వదళాలు ముస్లింలకు వ్యతిరేకంగా చేపట్టే హింసకు శ్రీరామ నవమిని ఒక అవకాశంగా వాడుకుంటున్నాయి. హిందూత్వానికి ఇదొక మాయని మచ్చగా చేసి, దానికి కళంకం తెస్తున్నాయి. తాము మతం పైనే నిలబడాలని, దాన్ని రక్షించాలని, దాన్ని ఉచ్ఛ స్థితికి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారే తప్ప, ఇది మతంపైన చాలా తక్కువ ప్రభావం చూపిస్తుందని గ్రహించలేకపోతున్నారు. శ్రీరామ నవమి జరిగిన మర్నాడు శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని హౌరా షిబ్‌పూర్ వద్ద ఎత్తున హింస చెలరేగింది. రెండవ రోజు జరిగిన ఈ సంఘటనను వార్తా పత్రికలు మొదటి పేజీలో పతాక శీర్షికన ప్రచురించాయి. ఈ హింస అసాధారణమైనదని ఈ వార్తకు చాలా ప్రాధాన్యతనిచ్చాయి. శ్రీరామ నవమి సందర్భంగా గురువారం దేశ వ్యాప్తంగా అనేక చోట్ల జరిగిన తీవ్రమైన హింసకు పత్రికలు అంత ప్రాధాన్యతనివ్వలేదు! శ్రీరామ నవమి రోజు దేశ వ్యాప్తంగా జరిగిన హింసాత్మక సంఘటనలు జరిగినప్పటికీ వాటిని లోపల పేజీలో అప్రధానంగా ప్రచురించాయి.

శ్రీరామ నవమి సందర్భంగా ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన హింస ఇప్పటికీ వార్తే. దానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రచురించాలి. ఈ భయంకరమైన హింస జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించడానికి కొందరు ప్రయత్నించారు. అయితే ఈ హింసను ముస్లింలే ప్రేరేపించారని హిందూ బాధితుల పేరుతో ఈ హింసను కొన్ని గొంతులు సమర్థించాయి. అనుమానమే లేదు, ముస్లింల లాగానే కొందరు హిందువులు కూడా గాయపడిన మాట వాస్తవం. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? హింస చెలరేగినప్పుడు ప్రతి వ్యక్తి తన మతస్థుల తప్పులతో సంబంధం లేకుండా, తమపైనే దాడి చేశారని బాధపడిపోవడం సహజం.

గుజరాత్, మహరాష్ర్ట, బీహార్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలలో హిందుత్వవాదులు శ్రీరామ నవమి ఊరేగింపులో కాషాయ జెండాలతో పాటు లాఠీలు, హాకీ స్టిక్కులు, కత్తులు, తుపాకులు పుచ్చుకుని ఉద్రిక్తతలను పెంచినట్టు సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు, ఫోటోలు చాలా కలవరపెట్టాయి. ముస్లింలను కించపరిచే నినాదాలతో వారి వీధుల్లోకి ప్రవేశించారు.మసీదులు, దర్గాలపైన కాషాయ జెండాలు ఎగురవేస్తూ విధ్వంసానికి దిగారు. పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రితో, ఆ రాష్ర్ట గవర్నర్‌తో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ పైనే ఆయన ప్రత్యేకమైన దృష్టిని ఎందుకు సారించారో ఊహించవచ్చు. ఇతర రాష్ట్రాలలో కూడా హింస చెలరేగితే, వాటిపైన ఎందుకు దృష్టి సారించలేదు?.

ఈ హింసకు సంబంధించిన వివరాలు ఇవ్వవలసిన అవసరం లేదు. ఆ వివరాలన్నీ చర్విత చర్వణాల్లా విసుగ్గా ఉండవచ్చు. పెద్ద సంఖ్య లో అల్లరి మూక కాషాయ జెండాలు పట్టుకుని ఆయుధాలుగా కర్రలు, కత్తులు, కొన్ని చోట్ల తుపాకులతో వెళ్ళడమే కాకుండా, ముస్లింలను కించపరిచేలా పెద్ద పెట్టున వినిపించే స్పీకర్లను కూడా ఉపయోగించారు. కొన్ని చోట్ల దర్గాలపైకి, మసీదులపైకి వెళ్ళి రాళ్ళు విసిరి, అక్కడ కాషాయ జెండాలు ఎగురవేశారు. వాటి పైకప్పు నుంచి హిందూ రాష్ర్టం ఏర్పాటే తమ ధ్యేయమని, ముస్లింలను చంపేయాలని ప్రేరేపించారు. హింసను, అసభ్యతను బహిరంగంగా ప్రదర్శించడానికి శ్రీరామ నవమి సందర్భంగా ఏర్పాటు చేసిన ‘శోభా యాత్ర’ హిందుత్వ వాదులకు ఒక వేదికైంది. శ్రీరాముడి గొప్పతనాన్ని కీర్తించడం కాదు, ముస్లింల పట్ల ఒక బలమై విద్వేషాన్ని ప్రదర్శించడంగా అది తయారైంది. ఈ ‘శోభాయాత్ర’ పైన ముస్లింలు కూడా రాళ్ళు విసిరారని చాలా మంది చెప్పారు. ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం తమ పూర్వీకులకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా తామీ చర్యలకు దిగుతున్నామని హిందుత్వవాదులు ఈ హింసను సమర్థించుకుంటున్నారు.

అలా అని ప్రకటించకుండానే ఈ హింసకు దిగారని ఒక ముస్లిం వ్యక్తి అన్నాడు.ఈ ‘శోభాయాత్ర’ను నిర్వహిస్తున్నప్పుడు హిందువులు హింసకు పాల్పడినప్పుడు పోలీసులు మెజారిటీ మతస్థులను సమర్థించడమో, తమ కళ్ళముందే హింస జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడమో చేశారు. ఈ హింసాత్మక సంఘటన కేసులు న్యాయ స్థానాల దృష్టికి వెళ్ళినప్పుడు ముస్లింలే హింసకు పాల్పడ్డారని, దాన్ని ఎదుర్కోవడం తప్ప హిందువులకు వేరే మార్గం లేదని పోలీసులు అనేక సార్లు చెప్పారు. గత ఏడాది ఢిల్లీలోని జహంగీర్ పురిలో హింస చెలరేగినప్పుడు పోలీసులు తెలివిగా ఏం చెప్పారో ఇప్పుడు కూడా అదే విధంగా చెపుతున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా జరిగే హింస, పోలీసుల నిర్లిప్తత వంటి సంక్లిష్ట స్థితి కొత్త కాదు. పైగా దానికొక చరిత్ర కూడా ఉంది. హిందూ బాధితుల గురించి వివరించడంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్) ఈ హింసను ఒక ఎత్తుగడగా వాడుకుంటోంది. గడిచిన అనేక దశాబ్దాలుగా శ్రీరామ నవమి సందర్భంగా జరిగిన హింస గురించి ప్రముఖ న్యాయవాది చందర్ ఉదయ్ సింగ్ ఒక నివేదికను తీసుకొచ్చారు. ఈ హింస వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటంటే, ‘శోభాయాత్ర’ను ముస్లింలు అధికంగా ఉండే వీధులు, సందుల్లోనే నిర్వహించాలని దాని నిర్వాహకులు ఒత్తిడి చేస్తున్నారన్నది ఈ నివేదిక సారాంశం.

ఈ ఊరేగింపులో ఆయుధాలు తీసుకెళ్ళడమనేది సర్వసాధారణమైపోయిందని ఆ నివేదిక పేర్కొంది.
బిజెపి కేంద్రంలో అధికారం చేపట్టాక శ్రీరామ నవమి ఉరేగింపుల్లో వచ్చిన మార్పు ఏమిటంటే, ఈ ఊరేగింపుల వెనుక ప్రభుత్వం ఉండడం, తద్వారా హిందుత్వ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవాలనుకోవడం. గతంలో శ్రీరామ నవమి శోభాయాత్రలు జరగని పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలలో కూడా ఇప్పుడు వాటిని నిర్వహించడం విశేషం. బిజెపి బెంగాల్‌లో ఈ యాత్రలు భారీ ఎత్తున నిర్వహించడానికి హిందీ మాట్లాడే రాష్ట్రాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తరలించింది. శ్రీరామ నవమి అయిపోయాక కూడా కేరళలో శ్రీరామ నవమి బ్యానర్లను నేను చూశాను. నేను విచారిస్తే, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ సాయంతో ఇలాంటి ఉత్సవాల యాత్రలను ఇతర ప్రాంతాల నుంచి కేరళకు దిగుమతి చేసుకున్నారని స్పష్టమైంది. క్రమంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ రాముడి బాజాలెక్కి దేశంలోని వివిధ ప్రాంతాలకు తమ హింసాత్మక రాజకీయాలను విస్తరిస్తున్నాయి.

హిందూ పండుగల్లో నేరపూరితమైన హింసాత్మక చర్యలను నిర్ద్వద్వంగా ఖండిస్తూ రచనలను చేసిన ప్రేమచంద్ లాంటి రచయితలు నాకిప్పుడు పెద్దగా కనిపించడం లేదు. మసీదుల ఎదుట ప్రదర్శనలను నిర్వహిస్తూ, బిగ్గరగా పాటలను వినిపించడాన్ని నిలుపుదల చేయాలని చెప్పడం న్యాయం కాదని ఎవరు చెపుతారు? తమ ఆలోచనలను, చర్యలను మార్చుకోవాలని, ఆత్మపరిశీలన చేసుకోవాలని హిందుత్వ వాదులకు ఎవరు చెపుతారు? హిందుత్వ వాదులు తమ భూభాగాన్ని విస్తరించుకోవాలని కోరుకోవడమే కాకుండా శ్రీరామనవమి సందర్భంగా ఏదైనా చేయవచ్చు. కానీ, ముస్లింలే ధ్యేయంగా పెట్టుకుని హింసకు పాల్పడుతున్నారు. ఒక వైపు శ్రీరామ నవమి సందర్భంగా హింసను ప్రేరేపిస్తున్నారు. మరొక వైపు ముస్లింల హింసను నిలుపుదల చేస్తున్నామంటూనే, రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు చేసే ప్రార్థనలకు ఆటంకం కలిగిస్తున్నారు.

హిందుత్వ వాదాన్ని తలకెత్తుకునే వారిలో ఒక ఆత్మన్యూనతా భావాన్ని కల్పించిన ఫలితంగానే ఇది జరుగుతోంది. హిందుత్వ వాదులు మతం, మత ఉత్సవాల ద్వారా ఆనందాన్ని, శాంతిని పొందడం కంటే కూడా ముస్లింలపైన, క్రైస్తవులపైన దాడులు చేయడం ద్వారా మనసులపై ఒత్తిడిని పెంచుతున్నారు. ఇలాంటి హింసాత్మక చర్యలు, అభద్రతా భావం అనేవి మతంపైన దారుణమైన ప్రభావం కలగచేస్తాయి. అలా చేస్తేనే తాము సురక్షితంగా ఉండగలమని, జీవించగలమని నమ్మబలుకుతున్నారు.

రాఘవశర్మ, 9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News