ఇప్పుడు ఎవరూ చర్చించుకోవడం లేదు
శరద్ పవార్
పుణె : అయోధ్యలో రామ మందిరం అంశంపై ఇప్పుడు ఎవరూ ఏమాత్రం చర్చించుకోవడం లేదని ఎన్‌సిపి (ఎస్‌పి) అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. అధికార బిజెపి ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఆ అంశంపై నుంచి ఎటువంటి రాజకీయ ప్రయోజనమూ పొందకపోవచ్చునని పవార్ సూచించారు. పుణె జిల్లా పురందర్‌లో పవార్ గురువారం కొందరు విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో రామ మందిరం ఏమైనా కీలక పాత్ర పోషిస్తుందా అన్న ప్రశ్నకు పవార్ సమాధానం ఇస్తూ, ‘అయోధ్యలో రామ మందిరం అంశం ఇప్పుడు ముగిసింది. దానిపై ఎవరూ ఏమాత్రం చర్చించుకోవడం లేదు’ అని చెప్పారు.
‘శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠించారు కానీ సీతా మాత విగ్రహం అక్కడ లేదని ఒక సమావేశంలో కొందరు మహిళలు వ్యాఖ్యానించారు’ అని పవార్ తెలిపారు. అయితే, పవార్ వ్యాఖ్యలను బిజెపి తీవ్రంగా విమర్శించింది. మాజీ ముఖ్యమంత్రి అయోధ్యలోని రామ మందిరంపై వ్యాఖ్యానించే ముందు సమాచారం సేకరించి ఉండవలసిందని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవన్‌కులె అన్నారు. ’శ్రీరాముడు అక్కడ బాలుని రూపంలో ఉన్నారు. కాని పవార్ సాహెబ్‌కు దానిపై రాజకీయం చేయడంపైనే ఆసక్తి ఉంది’ అని బవన్‌కులె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
‘సొంత కోడలిని పరాయి వ్యక్తిగా పరిగణించే పవార్ సీతామాత గురించి ఆందోళన వ్యక్తం చేయడం కాపట్యం కాక మరేమీ కాదు’ అని బవన్‌కులె విమర్శించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌ను ఉద్దేశించి శరద్ పవార్ చేసిన ఆ వ్యాఖ్యను బిజెపి నేత ప్రస్తావించారు. సునేత్ర పవార్ బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలైపై పోటీ చేస్తున్న విషయంవిదితమే.