Monday, January 20, 2025

రాముడొచ్చాడు

- Advertisement -
- Advertisement -

దివ్య మందిరంలో కొలువుదీరిన బాల రాముడు

అయోధ్య : అయోధ్యలో భవ్య మందిరంలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో ఒక కొత్త శకం ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మన రామ్‌లల్లా ఇక టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదని, దివ్య మందిరంలో కొలువుదీరాడని ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే వెయ్యి సంవత్సరాలకు బలమైన , భవ్యమైన, దివ్యమైన భారత్‌ను నిర్మించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం రామమందిరంలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ప్రధాని మోడీ ఆహూతులనుద్దేశించి ప్రసంగించారు. ‘ జై సియారామ్’ అంటూ ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

‘పవిత్రమైన అయోధ్యాపురికి శిరసు వంచి నమస్కరిస్తున్నా. ఈ రోజు రామభక్తులంతా ఆనంద పారవశ్యంలో ఉన్నారు. ఎన్నో బలిదానాలు,పోరాటాలు,త్యాగాల అనంతరం మన రాముడు మళ్లీ అయోధ్యకు వచ్చాడు. ఈ శుభ ఘడియలో ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. నా మనస్సంతా బాలరాముడి రూపంపైనే ఉంది. నా శరీరం ఇంకా ఆ అనుభూతిని ఆస్వాదిస్తోంది. ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించమని రామయ్యను వేడుకొంటున్నా. ఆయన క్షమిస్తాడన్న నమ్మకం ఉంది. జనవరి 22, 2024.. కేవలం ఒక తేదీ కాదు, కొత్త కాలచక్రానికి ప్రతీక. ఈ సమయానికి పరిపూర్ణ దివ్యత్వం ఉంది. కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ప్రజలు ఈ తేదీని గుర్తుంచుకుంటారు. రామమందిర నిర్మాణం దేశ ప్రజల్లో కొత్త శక్తిని నింపింది. త్రేతాయుగంలో రాముడి కోసం అయోధ్య వాసులు 14 ఏళ్లు ఎదురు చూశారు. కలియుగంలో ఈ క్షణం కోసం అయోధ్య ప్రజలు ఎన్నో వందల సంవత్సరాలు నిరీక్షించారు. స్వాతంత్య్రం తర్వాత కూడా ఎన్నో ఏళ్లు న్యాయపోరాటం చేశాం. చివరికి మన నిరీక్షణ ఫలించింది. ఇన్నేళ్లకు మన కల సాకారం అయింది. రాముడు వచ్చి తీరుతాడన్న శబరి నిరీక్షణ నిజమైంది. శ్రీరాముడి ఆశీస్సులతో ఈ అద్భుత ఘట్టంలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ రోజు దేశ ప్రజలంతా దీపావళి జరుపుకొంటున్నారు. ఈ రాత్రికి ప్రతి ఇంటా రామజ్యోతి వెలగాలి’ అని పిలుపునిచ్చారు. అయోధ్యలో మనం చూసిన వేడుకలు లాంటివి విదేశాల్లో కూడా జరుపుకొంటున్నారన్నారు.
రాముడు వివాదం కాదు.. సమాధానం
రామాలయ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని, చివరికి న్యాయమే గెలిచిందని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. ఇందుకు న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన్నారు. ‘ఈ శుభ ఘడియల కోసం 11 రోజుల దీక్ష వహించా. అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాముడి ప్రధాన ఆలయాలు, రాముడు నడయాడిన ప్రదేశాలు దర్శించుకున్నా. నాసిక్‌లోని కాలారామ్ ఆలయం మొదలుకొని రామేశ్వరం దాకా అన్ని ఆలయాలను దర్శించా. సాగర్‌నుంచి సరయూ వరకు రామనామం జపించా. అన్ని భాషల్లోని రామాయణాలు విన్నా. భాష ఏదయినా రాముడు అందరికీ ఆరాధ్య దైవం. రాముడు లోకానికి ఆదర్శం.ఈక్షణం దేశ ప్రజల సహనం, పరిపక్వతకు నిదర్శనం. ఇది మన విజయానికే కాదు.. వినయానికి కూడా సూచిక. కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్థం చేసుకోలేక పోయారు. రామనామం ఈ దేశ ప్రజల కణం కణంలో నిండి ఉంది. మన దేశ సంస్కృతి, కట్టుబాట్లకు రాముడే మూలం. ఆయన ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యం. ఇది విగ్రహ ప్రాణప్రతిష్ఠే కాదు.. మన విశ్వాసాలకు ప్రాణప్రతిష్ఠ. రాముడు వివాదం కాదు.. సమాధానం. రాముడు అగ్ని కాదు.. వెలుగు. రాముడే భారత్ ఆధారం. ఆయనే భారత విధానం. రాముడే నిత్యం. ఆయనే నిరంతరం. రాముడే విశ్వం.. ఆయనే విశ్వాత్మ’అని మోడీ కొనియాడారు. దేవుడినుంచి దేశం… రాముడినుంచి రాజ్యం ఇది మన నినాదం. త్రేతాయుగంలో రాముడు వచ్చాకే వేల ఏళ్ల పాటు ఈ దేశం ప్రపంచాన్ని శాసించింది. రాబోయే వెయ్యేళ్ల కోసం నేడు పునాది వేస్తున్నాం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ భావోద్వేగంగా అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News