మాస్ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టి టీం వర్క్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మంగళవారం మేకర్లు ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. రెండు డేట్లను మేకర్లు లాక్ చేశారు. మార్చి 25న లేదా ఏప్రిల్ 15న ఈ మూవీని విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. “మా చిత్రంపై మాకు ప్రేమ… అలానే ఇతర చిత్రాలపై అమితమైన గౌరవం కూడా ఉంది. మార్చి 25న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం. కానీ మారిన పరిస్థితులను బట్టి మా సినిమాను మార్చి 25న లేదా ఏప్రిల్ 15న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం” అని నిర్మాతలు ప్రకటించారు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.