Sunday, January 19, 2025

వరాహావతారంలో దర్శనమిచ్చిన రామయ్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / భద్రాచలం : వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యనోత్సవాల్లో భాగంగా ఆదివారం భద్రాద్రి రాముడు భక్తులకు వరాహావతారంలో దర్శనమిచ్చారు. ఈ అవతారాన్ని వీక్షించి తరించడానికి భక్తులు తరలివచ్చారు. వారాంతపు శెలవులు కావడంతో భక్తులు భద్రాద్రికి భారీగా చేరుకున్నారు. ఈ అవతారాన్ని కనులారా కాంక్షిస్తే రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. తొలుత అంతరాలయంలో రామయ్యకు ప్రత్యేక ఏకాంత తిరుమంజనం గావించారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహావచనం నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు వాళయార్ దివ్యప్రబంధనం చదివారు. తర్వాత ఉత్సవమూర్తులను బేడామండపం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు జరిపారు.

స్వామిని ప్రత్యేక పల్లకీలో అలంకరించి మాడ వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. కోలాట నృత్యాలు, సన్నాయి వాయిద్యాలు, భక్తుల కోలాహలం మధ్య స్వామివారిని మిథిలా ప్రాంగణానికి తీసుకొచ్చి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని వీక్షించి తరించారు. వచ్చిన భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం భక్తుల కోలాహలం నడుమ సాయత్రం స్వామి వారికి తిరువీధి సేవను నిర్వహించారు. వేద విద్యార్ధుల మంత్రోచ్ఛారణలు, ఆస్థాన విద్వాంసుల నాదస్వరాల నడుమ తాతగుడి వరకు తిరువీధి సేవ సాగింది. ఈ సందర్భంగా రాత్రి మిథిలాస్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.

నేడు నరసింహావతారం…

వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యనోత్సవాల్లో భాగంగా సోమవారం భద్రాద్రి రాముడు భక్తులకు నరసింహావతారంలో దర్శనమిస్తారు.తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుని అనేక బాధలకు గురిచేస్తున్న హిరణ్యకశిపుడు అనే రాక్షసుడ్ని సంహిరంచడానికి నారాయణుడు నరసింహావతారాన్ని ధరించాడు. ఈ ఆకారం నుడివి స్వల్పకాలికమైనా.. భగవానుని సర్వవ్యాపకతను తెలియజేస్తుంది. భూత గ్రహ బాధలు, కుజ గ్రహ బాధలు ఉన్నవారు ఈ అవతారాన్ని పూజించడం వలన వాటి నుండి విముక్తిని పొందుతారని ప్రతీతి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News