ఈదుల్ ఫిత్ పర్వదినాన్ని సాధారణంగా రమజాన్ పండుగ అని వ్యవహరిస్తారు. రమజాన్ పేరు వినగానే మనసు, తనువు తన్మయత్వంతో పులకించిపోతుంది. భక్తిభావంతో శిరస్సు వినమ్రంగా వంగిపోతుంది. గుండెల నిండా ఆనందం ఉప్పొంగుతుంది. మనసు ఆనందంగా ఉంటే దేహంలోని అవయవాల ఆరోగ్యంగా ఉంటాయి. ఆనందం ఆయుష్షును పెంచితే, భక్తి ముక్తిని ప్రసాదిస్తుంది. జీవితంలో మనిషి ఆనందించే సమయ సందర్భాలు అనేకం ఉంటాయి. వాటిలో పండుగలు ప్రధానమైనవి. ప్రాచీన కాలం నుండీ ప్రతి జాతిలో, ప్రతి దేశంలో పండుగలు చలామణిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే ‘ఈదుల్ ఫిత్’్ర పర్వదినం కూడా అలాంటిదే. నిజానికి ఈ పండుగ సంబంధం రమజాన్ మాసంతో ముడిపడి ఉంది. అందుకే ఇది రమజాన్ పండుగగా ప్రసిద్ధి గాంచింది. అసలు రమజాన్ అన్నది ఒక నెల పేరు. సంవత్సరంలోని పన్నెండు నెలల్లో ఇది తొమ్మిదవది.
దీనికింతటి ప్రత్యేకత ప్రాప్తం కావడానికి కొన్ని కారణాలున్నాయి. ఒకటి: సర్వమానవాళకి మార్గదర్శక గ్రంథమైన పవిత్ర ఖురాన్ రమజాన్ మాసంలోనే అవతరించింది. మానవజాతికి వెలుగును, జ్ఞానకాంతిని ప్రసాదించే దివ్యజ్యోతి రమజాన్ మాసంలో అవతరించిన కారణంగా దీనికింతటి గౌరవం, ఘనత, పవిత్రత ప్రాప్తమయ్యాయి. రెండవ కారణం ఏమిటంటే, మానవుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే ‘రోజా’ (ఉపవాస వ్రతం) అనే గొప్ప ఆరాధనను కూడా దైవం ఈ నెలలోనే విధిగా నిర్ణయించాడు. ఇది జన హృదయాల్లో భయభక్తులు జనింపజేసి, మానవీయ సుగుణాలను పెంపొందిస్తుంది. పాపకార్యాలు, దుర్మార్గాల వైపుకు మనసు పోకుండా కాపాడుతుంది. ఉపవాసం వల్ల సహనశక్తి పెరుగుతుంది. జాలి, దయ, కరుణ, త్యాగం, పరోపకారం లాంటి మంచి గుణాలు అలవడతాయి. స్ధితిపరులు ఉపవాసం పాటిస్తే, పేదసాదల ఆకలి బాధను వారు అనుభవ పూర్వకంగా తెలుసుకోగలుగుతారు.
ఈ విధంగా ఎన్నో మానవీయ, నైతిక సుగుణాలను మానవుల్లో పెంపొందింపజేసే ఏర్పాటు చేసిన విశ్వ ప్రభువుకు కృతజ్ఞతగా రమజాన్ ఉపవాసాలను ముగించి షవ్వాల్ మొదటి తేదీన పండుగ జరుపుకుంటారు. శక్తివంచన లేకుండా ఆరాధనలు, సత్కార్యాలు ఆచరిస్తారు. దాన ధర్మాలు చేస్తారు. రమజాన్ మాసాంతంలో ఫిత్రాలు చెల్లిస్తారు. ఈ విధంగా నెల్లాళ్ళ పాటు అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ, రమజాన్ శుభాలతో పునీతమయ్యే మహాభాగ్యాన్ని కలిగించినందుకు అల్లాహ్ కు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ పండుగ చేసుకుంటారు. పండుగ రోజు ముస్లిం సాదరీ, సోదరులంతా వేకువ జామునే నిద్రలేస్తారు. స్నాన పానాదులు ముగించుకొని ప్రాతః కాల ఫజర్ నమాజు ఆచరిస్తారు. ఉన్నంతలోనే మంచిదుస్తులు ధరించి, అత్తరు పన్నీరు లాంటి సుగంధ ద్రవ్యాలు వినియోగిస్తారు. అందరూ ఈద్ గాలో సమావేశమై సామూహికంగా దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈద్ నమాజ్ చేస్తారు.
తమ అపరాధాలను మన్నించమని, సన్మార్గాన నడపమని దువా చేస్తారు. సమస్త మానవాళి సుఖసంతోషాలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్ధనలు చేస్తారు. వ్యాధులబారి నుండి, అప్పుల బారి నుండి, శతృవు బారి నుండి, కరువు కాటకాల నుండి, దారిద్య్రం నుండి తమను, తమ దేశాన్ని, యావత్ భూప్రపంచాన్ని రక్షించమని కడు దీనంగా విశ్వ ప్రభువును వేడుకుంటారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు, పరిచితులు, అపరిచితులందరితో తమ ఆనందాన్ని పంచుకుంటారు. ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతారు. కరచాలనాలు, ఆత్మీయ ఆలింగనాలతో అనుబంధాన్ని చాటుకుంటారు. సేమియా పాయసాన్ని అందరికీ తినిపించి ఆనందిస్తారు.
ఈ విధంగా ఈదుల్ ఫిత్ పండుగ సమాజంలో ఒక చక్కని సుహృద్భావ పూర్వకమైన, ప్రేమపూరితమైన, సామరస్య కుసుమాలను వికసింపజేస్తుంది. మానవీయ విలువల పరిమళాన్ని వెదజల్లుతుం ది. దైవ భక్తి, దైవ భీతి, బాధ్యతా భావం, జవాబుదారీతనం లాంటి అనేక సుగుణాలను జనింపజేస్తుంది. మానవులను ఉత్తమ, ఉన్నత గుణ సంపన్నులుగా, మానవతా మూర్తులుగా తీర్చిదిద్దుతుంది. కనుక పండుగ పరమార్ధాన్ని అవగాహన చేసుకుంటే రమజాన్ ఆరాధనల ఆశయం నెరవేరుతుంది. భావి జీవితాలు సుఖ సంతోషాలతో గడిచిపోతాయి. సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరుస్తాయి. అవినీతి, అక్రమాలు. దోపిడీ. పీడన, దారిద్య్రం, వివక్ష, అణచివేత, అసమానతలు లేని ఒకచక్కని సుందర సమాజం ఆవిష్కృతమవుతుంది. పండుగ పంచిన మంచి మానవ జీవితాల్లో చివరి శ్వాస వరకూ గుబాళించాలని మనసారా కోరుకుందాం.
యండి ఉస్మాన్ ఖాన్
9912580645