రంజాన్ దానాల పండుగ. ఉన్నంతలో కొంత ఇతరులకు పంచే పండుగ. ఇతరులకు ఎంతిస్తే అంత ఆనందమని భావించే సంబరం. నెలపొడుగునా ప్రతి మనిషిలోనూ ప్రవహించే మానవతా రాగం. అలాంటి పండుగ మీద తెలుగు సాహిత్యంలో అనేక కథలు వచ్చాయి. వాటితో పాటు ముందు మనం ప్రపంచ ప్రసిద్ధమైన భారతీయ కథ ‘ఈద్గా’ గురించి కూడా మాట్లాడుకుందాం. రంజాన్ నేపథ్యంలో సాగే ‘ఈద్గా’ కథను ప్రేవ్‌ు చంద్ 1933లో ఉర్దూలో రాశారు. తెలుగులో ఈ కథను ఎక్కువమందికి పరిచయం చేసింది నేషనల్ బుక్ ట్రస్టు వారే అని చెప్పాలి. పులిగడ్డ విశ్వనాథ రావుతో అనువాదం చేయించి ప్రత్యేకంగా ఈ కథ ఒక్కటే తెలుగులో ఆకట్టుకునే బొమ్మలతో పుస్తకంగా వేశారు. ఇప్పటికే అనేక ముద్రణలు పొంది వేలాది ప్రతులు అమ్ముడుపోయిన ఈ పుస్తకం తాజాగా 2019లో పునర్ముద్రితమైంది.
ఇందులో ఐదేళ్ల పిల్లాడు హమీద్ పాత్ర అందరికీ శాశ్వతం గా గుర్తుండిపోతుంది. హమీద్ అమ్మానాన్నలు లేని పిల్లవాడు. అమ్మమ్మ దగ్గర పెరుగుతాడు. పేదరికం. అమ్మమ్మ కూలి చేసి ఇతన్ని పోషిస్తుంటుంది. అలాంటి సమయంలో రంజాన్ పండగొస్తుంది. ఊరంతా సందడిగా ఉంటుంది కానీ అమ్మమ్మ మాత్రం ‘ఎందుకొచ్చిన పండగ.. దండగ’ అంటుంది. పిల్లవాడికి కొనుక్కోవడానికి అతి కష్టమ్మీద మూడు కాన్ల చిల్లర ఉంటే ఇస్తుంది. హమీద్ ఈద్గాకు వెళ్తాడు. అతని కాళ్లకు చెప్పులుండవు, కొత్తబట్టలు ఉండవు. స్నేహితులతో కలుస్తాడు. నమాజ్ పూర్తి చేసుకుంటాడు. తిరునాళ్లలో అనేక బొమ్మలు అతన్ని ఊరిస్తాయి. కొనడు. అనేక తినుబండారాలు కదిలిస్తాయి. అయినా కొనడు. స్నేహితులంతా రకరకాల వస్తువులు కొనుక్కుంటారు. ఇతన్ని ఆట పట్టిస్తారు. ‘మూడు కాన్లకు ఏమీ రాదు పో..’ అంటారు.
నిజానికి ఆ మూడు కాన్లమీద హమీద్‌కి పూర్తి స్వేచ్ఛ ఉంది. దాంతో అతను ఏదొస్తే అది ఎంతొస్తే అంత కొనుక్కోవచ్చు. అమ్మమ్మ కూడా అతనికి అదే చెప్పి పంపుతుంది. అయినా అతను కోరికలను అణచుకుంటాడు. స్నేహితుల ముందు ‘అవన్నీ శుద్ధ దండగ’ అని బుకాయిస్తాడు. చివరికి ఒక కొట్టు దగ్గర ఇనుప చిమటా (రొట్టెలను కాల్చే పటకారు) ఒకటి కొనుక్కుని ఇంటికెళ్తాడు. అమ్మమ్మ అది చూస్తుంది. ‘ఏం పిచ్చిలోకానివి రా నువ్వు… డబ్బుల్తో ఏదో ఒకటి కొనుక్కుని తినకుండా ఈ చిమటా తెచ్చావేమిటిరా’ అని అరుస్తుంది. దానికి మనవడు ‘పెనం మీద రొట్టెలు వేసేటప్పుడు నీకు వేళ్లు కాలుతున్నాయి కదా.. అందుకే తెచ్చాను’ అంటాడు. అతని మాటల్తో అమ్మమ్మ కళ్లల్లో నీళ్లూరుతా యి. ఒక్క అమ్మమ్మ కళ్లల్లోనేనా.. చదువుతున్న మన కళ్లలో కూడా.
ఇందులో ప్రేవ్‌ు చంద్ పండగ సౌందర్యాన్ని వివరించిన తీరు అద్భుతం. అసలు ఇప్పటికీ చాలా మందికి ముస్లింలు పండగ పూట ఈద్గా దగ్గర ఏం చేస్తారో తెలీదు. ఎప్పుడో 90 ఏళ్ల క్రితమే ప్రేవ్‌ు చంద్ దాన్ని చెప్పేశాడు. ఇందులో పిల్లల మనస్తత్వాన్ని ఏ మానసిక శాస్త్రవేత్తకూ తీసిపోని విధంగా వివరిస్తాడు రచయిత. ప్రేవ్‌ు చంద్ అసలు పేరు ధన్పత్ రాయ్ శ్రీవాత్సవ్. ఉత్తర ప్రదేశ్‌లో పుట్టాడు. హిందీ, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యుడు. సమాజంలోని ఇతర సమూహాల పట్ల, వారి సంస్కృతీ సంప్రదాయాల పట్ల ఎంతో పరిశీలన, ప్రేమ ఉంటే తప్ప ఇలాంటి కథ రాయడం అసాధ్యం. ముస్లిం సంప్రదాయాన్ని వారి ఇళ్లలోని దైన్యాన్ని కళాత్మకంగా చిత్రిస్తూనే సమాజంలోని దోపిడీ గురించి కూడా వివరిస్తాడు రచయిత. ఇన్నేళ్ల కాలంలో ఇలాంటి సందర్భానికి సంబంధించి మరో శక్తివంతమైన కథ రాలేదంటే అతిశయోక్తి కాదు.
తెలుగులో ముస్లిం జీవితం ఉన్న కథలు కొత్తకాదు. గురజాడ, శ్రీపాద నుంచే ఈ ఒరవడి ఉంది. తొలితరం కథల్లో ఎక్కువగా మత మార్పిడులు (గురజాడ మతం విమతలు, మీ పేరేమిటి? శ్రీపాద ఇలాంటి తవ్వాయి వస్తే) మూఢనమ్మకాలు, వివక్ష గురించి చర్చ జరిగింది. అయితే ముస్లిం ఇళ్లలోని నాలుగు గోడల మధ్య జరిగే ఆచారాలు, సంప్రదాయాల జోలికివారు వెళ్లలేదు. వారే కాదు ఆ తర్వాత వచ్చిన ముస్లిమేతర కథకులు ఎవరూ ఆ సాహసం చేయలేదు. అడపాదడపా ముస్లిం జీవిత కథలు వచ్చినా అవి మత సామరస్య గోడలు దాటి పయనించలేదని చెప్పవచ్చు. తెలుగు లో మొదటగా ఆ మూసను బద్దలు కొట్టింది కడప జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సత్యాగ్ని. ఇతను 1988లో ‘పాచికలు’ కథ రాయడంతో ముస్లిం ఇళ్లలోని సంప్రదాయాలు, ఆచారాలు తెలుగు కథల్లోకి ప్రవేశించాయి.
ముస్లింలే ముస్లిం జీవితం రాసుకోవడం వల్ల బయటి సమాజానికి తెలియని అనేక విషయాలు చర్చకు వస్తాయని నమ్మి తాను ఈ రకమైన పనికి పూనుకున్నట్టు స్వయంగా రచయితే తన కథల పుస్తకం (సత్యాగ్ని కథలు) ముందు మాటలో చెప్పుకున్నారు. అయితే రంజాన్ పండుగ నేపథ్యంగా ఈ రచయిత కథ లేకపోవడం కొంత లోటును కలిగిస్తుంది. తొలిసారిగా తెలుగు కథల్లోకి రంజాన్ కళను తీసుకొచ్చింది మాత్రం ఖదీర్ బాబు అనే చెప్పాలి. ఆయన దర్గా మిట్ట కతల్లో (1999) భాగంగా ‘కసాబ్ గల్లీలో సేమ్యాల ముగ్గు’ అనే కథ రాశారు. ముస్లిం వీధిలోని ఒక కుటుంబం సేమ్యాలు వేసుకోవడానికి పడే తిప్పల గురించి ఈ కథ రసవత్తరంగా చెబుతుంది. సేమ్యాలు వేసుకునే మిషన్ కోసం పడే పాట్లు, చివరికి చేత్తోనే ఇంటి ఆడవాళ్లు సేమ్యాలు వేసుకునే తతంగం ఒకవైపు సరదాగా నవ్విస్తూనే మరో వైపు దుఃఖం తెప్పిస్తుంది.
అలాగే శశిశ్రీ (షేక్ బేపారి రహమతుల్లా) ‘ఇజ్జత్’ (2005) అనే కథ రాశారు. రంజాన్ పండుగొచ్చినప్పుడు ఇంటిల్లిపాదికి కొత్తబట్టలు కొనివ్వలేని దైన్యం ఈ కథలో కనిపిస్తుంది. కథానాయకుడు సత్తార్ పండ్ల వ్యాపారి. ఒక రోజు పోలీసులు పండ్ల బండిని సైడు కాలువలోకి తోసెయ్యడంతో వెయ్యి రూపాయలు నష్టం వస్తుంది. ఇక బట్టలు కుట్టిన దర్జీకి డబ్బులు ఇవ్వలేక పడే యాతన ఈ కథ. బా రహమతుల్లా ‘చాంద్ కీ ఈద్’ (2007) అనే కథను రాశారు. రంజాన్ మాసంలో తండ్రీ కొడుకులకు ఎదురైన అనుభవాలను నాలుగు శుక్రవారాలుగా విడదీసి కథగా చెప్పారు. శైలి రీత్యా బాగా కుదిరిన కథ. ఇందులో హైదరాబాద్ పాతబస్తీ వాతావరణం కొంత కనిపిస్తుంది. ఒకవైపు పండగ సంప్రదాయాన్ని చెబుతూనే మరోవైపు ఇద్దరు పేద పిల్లల దీన గాథని ఈ కథ వినిపిస్తుంది. ఉన్నవాళ్లకు యేడాదిలో ఒక మాసం మాత్రమే ఉపవాసాలు.. లేనివాళ్లకు యేడాదంతా ఉపవాసమే. అలా యేడాదంతా ఉపవాసం ఉండే ఇద్దరు పేద పిల్లలు రంజాన్ మాసంలో మాత్రం ఎక్కడ విందు జరిగినా అక్కడికెళ్లి తిని ఆకలి తీర్చు కుంటా రు. ఈ వైరుధ్యాన్ని కథలో కదిలించేలా చెప్పాడు రచయిత.
తర్వాత స్కై బాబ ‘మజ్బూర్’ (2010) కథ గురించి చెప్పుకోవాలి. రంజాన్ పండగ నేపథ్యంలో కథ నడుస్తుంది కానీ ఇది ఒక పేదవాడి ప్రేమ కథ. పండగ పూట ఈద్గాకు వెళ్లిన జాని కాలి చెప్పు తెగుతుంది. ఇక కొత్త చెప్పులు కొనుక్కోవడానికి యాతన పడాల్సి వస్తుంది. అమ్మకు ఎవరో ఇచ్చిన ‘ఈదీ’ డబ్బులతో అప్పటికప్పుడు చెప్పులు కొని తనకెంతో ఇష్టమైన సల్మాను కలవడానికి వెళ్తాడు. అయితే అక్కడ సల్మా బదులు ఇంకెవరో సేమ్యాల పాయసం పెట్టి సల్మాకు పెళ్లి నిశ్చయమైందని చెబుతారు. దీంతో సేమ్యా చేదుగా అనిపిస్తుంది.
దాని తర్వాత చెప్పుకోవాల్సిన కథ వేంపల్లె షరీఫ్ రాసిన ఆకుపచ్చ ముగ్గు (2011). ఈ కథ ఆద్యంతం మతసామరస్యాన్ని కోరుకుంటూ రాసింది. పండగ వాతావరణం ఇందులో అందంగా ఇమిరింది. ‘ముగ్గు ఇంటి ముందు వేస్తే తప్పు కానీ అరచేతిలో వేస్తే కాదు కదా. ఒక మతానికి మరో మతానికి ఇంతేనా తేడా’ అని నిలదీస్తూనే ఈ కథ అన్ని రకాలుగా ఆలోచింపజేస్తుంది.
తర్వాత నబీ కరీం ఖాన్ ‘చాంద్ రాత్’ (2022) అనే కథ రాశారు. పండగ పూట ప్రభుత్వ బుల్డోజర్లు వచ్చి పేద ముస్లింల షెడ్డులను (దుకాణాలు) కూల్చేస్తారు.
ఇది కొంత సమకాలీన రాజకీయ సమస్యను చిత్రించింది.అలాగే వరంగల్‌కు చెందిన అన్వర్ రాసిన కథ ‘లాల్ మట్టి’లో కూడా రంజాన్‌కు సంబంధించిన ప్రస్తావన పరోక్షంగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు నాట రంజాన్ కథలకు కొదవ లేదు. అయితే ఈ కథలన్నింటిలోనూ పేదరికమే ప్రధాన వస్తువుగా ఉండటం గమనించాల్సిన విషయం. ఆ పేదరికానికి గల కారణాలను ప్రేవ్‌ు చంద్ మాదిరిగా ఎందుకనో రచయితలు శిల్పానికి అనుగుణంగా చర్చించే ప్రయత్నం కథల్లో చేయలేదు. అయితే ప్రేవ్‌ు చంద్ ఈద్గా కథ రాసేనాటికి ఇప్పటికీ ముస్లిం జీవితాల్లో ఏమాత్రం మార్పు లేదని చెప్పడానికి ఈ కథా సాహిత్యాన్ని కూడా ఒక ఉదాహరణగా తీసుకోవచ్చేమో.
ఏది ఏమైనా తెలుగు కథా సాహిత్యలో రంజాన్ కరీవ్‌ు పుష్కలంగా కనిపిస్తోంది. అది ముస్లింలు రాసినా ముస్లిమేతరులు రాసినా ఈ దేశంలో ఏ ఒక్కరు కూడా ఎప్పుడో యేడాదికోసారి వచ్చే పండగలను జరుపుకోవడానికి ఇబ్బంది పడకూడదు. అలాంటి పేదరికం నుంచి, దైన్యం నుంచి అన్ని అణగారిన వర్గాలు విముక్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పటికైతే ఇలాంటి ఈద్ కథలు చదివి ఆయా రచయితలకు ‘ఈద్ ముబారక్’ చెప్పేద్దాం.